వైకాపా లో నెంబర్ -2 స్థానంపై మీడియాలో రకరకాల కథనాలు ఎప్పటికప్పుడు హీటెక్కిస్తూనే ఉన్నాయి. వైఎస్ కుటుంబాన్ని అంటిపెట్టికుని ఉన్న నేతల్లో ఆ స్థానం ఎవరిదన్నది చాలా కాలంగా చర్చ సాగుతోంది. అదీ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక నెంబర్ -2 రచ్చ ఇంకా పెరిగింది. పార్టీలో యాక్టివ్ గా ఉన్నవారు…జగన్ తో అత్యంత సన్నిహితంగా మెలిగేవారి పేర్లు నెంబర్ -2 రేసులో జోరుగా వినిపించాయి. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయ సాయిరెడ్డి, షర్మిల ఇలా కీలక నేతల పేర్లు నెంబర్ -2 రేసులో చాలా కాలంగా చర్చ కొస్తున్నాయి.. ఇటీవలే జగన్ పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి సజ్జలకి పెద్ద పీఠ వేయడంతో జగన్ అతనికే పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు అనిపించింది.
విజయసాయిని, వైవి సుబ్బారెడ్డిని వెనక్కి నెట్టినట్లు కొత్త ప్రచారమైతే తెరపైకి వచ్చింది. తాజాగా ఈ నెంబర్ -2 స్థానం గురించి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. మా పార్టీలో నెంబర్ -2 అంటూ ఎవరూ లేరు. ఉన్నది ఒక్కటే అది నెంబర్-1 ఆ స్థానం జగన్ గారిదే. ఆ తర్వాత కార్యకర్తలే పార్టీకు బలం..వాళ్లకే రెండవ స్థానం అన్నట్లు చెప్పకనే చెప్పారు. అంటే నెంబర్ -2 స్థానం ఎవరిది? అన్నది ఇంకా డిసైడ్ కాలేదని ఓ క్లారిటీ అయితే దొరికింది. నెంబర్ -2 రేసులో విజయసాయి పేరు గతంలో ఎక్కువగా వినిపించింది. జగన్ ని ఎప్పుడూ అంటిపెట్టుకుని తిరిగేది అతనొక్కడే. సోషల్ మీడియాలో సైతం నెంబర్ -2 ఎవరంటే విజయసాయిపేరే వినిపించేది.
అయితే ఇటివలి చోటు చేసుకున్న పరిస్థితులు అంటే..విశాఖ పర్యటనలో భాగంగా జగన్ పక్కన కారులో విజయ సాయి కూర్చుంటే అతన్ని దించేయడం..మరో మంత్రిని పక్కన కూర్చోబెట్టుకోవడం..దానికి విజయసాయి ఎమోషనల్ ట్వీట్ వివరణ ఇవ్వడం వంటి సన్నివేశాలు చూస్తే పార్టీలో ఇబ్బందికర పరిస్థితుల్లోనే విజయసాయి ఉన్నట్లు ప్రచారం సాగింది. దీంతో నెంబర్ -2 స్థానంపై మరోసారి మీడియాలో ఆసక్తికర చర్చ మొదలైంది. చిలవలు ఫలవలుగా సాగే ఆ ప్రచారం ఇప్పుడు మరింత హీటెక్కింది. సుబ్బారెడ్డి తాజా వ్యాఖ్యల నేపథ్యంలో నెంబర్ -2 స్థానాన్ని ఇప్పట్లో ప్రకటించే అవకాశమైతే కనిపించలేదు.