ఏపీలో గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ దిశగా క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఏకగ్రీవాలను ప్రోత్సహించాల్సిన ఎన్నికల కమిషన్ అందుకు విరుద్ధంగా వ్యవహరించడాన్ని ఆక్షేపించారు. ఎన్నికల పేరుతో పల్లెల్లో కక్షలు రగిల్చేందుకు టీడీపీ కుట్ర చేస్తోందని, ప్రలోభాలకు గురిచేస్తే కఠినంగా శిక్షించే చట్టాలను ప్రభుత్వం తెచ్చిందని గుర్తు చేశారు.
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రామీణ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. అందుకే ఈ పంచాయతీ ఎన్నికలు చరిత్రాత్మకమైనవి. కొత్త నాయకత్వానికి అవసరమైన అన్ని సదుపాయాలూ సీఎం ఇప్పటికే సమకూర్చారు. మహాత్ముడు కోరుకున్న గ్రామ స్వరాజ్యం రావాలంటే పంచాయతీ ఎన్నికలు అవసరమే. అయితే ఇవి పట్టుదల, కక్షలకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితి రాకూడదని ప్రభుత్వం కోరుకుంటోంది. అందుకే పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలను స్వాగతిస్తోంది.
గ్రామాభివృద్ధిని కాంక్షించే స్వచ్ఛంధ సంస్థలు, మేధావులు, రాజకీయ పార్టీలూ పట్టుదలకు పోకుండా ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి. ఏకగ్రీవ ఎన్నికలు జరిగే పంచాయతీలకిచ్చే ప్రోత్సాహాకాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెంచింది. ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగేలా ప్రోత్సహిస్తాం అన్నారు. పంచాయతీ ఎన్నికల చట్టంలో అనేక మార్పులు తెచ్చాం. ఎన్నికల సమయాన్ని తగ్గించాం. హింస, ప్రలోభాలకు పాల్పడితే అనర్హత వేటు, మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఎన్నికైన తర్వాత కూడా ఆరేళ్లపాటు పోటీ చేసే అవకాశం ఉండదు.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను సగంలో ఆపేసి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు తెరమీదకు తెచ్చిన ఎన్నికల కమిషన్‌పై మాకు అనుమానాలున్నాయి. ఆయన మాటల్లోనూ దురుద్దేశం ఉందనేది స్పష్టమైంది. గత మార్చిలో ఏకగ్రీవాలు సమ్మతమన్న ఎన్నికల కమిషనర్ ఇప్పుడు ఏకగ్రీవాలు జరిగే పంచాయతీలను ఓ చూపు చూడాలని హెచ్చరించడం వింతగా ఉంది అని అన్నారు. 60 ఏళ్లుగా ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని అంతా కోరుకున్నారు. ఏకగ్రీవాల కోసం ప్రోత్సాహకాలూ ఇస్తున్నారు. ఇందుకు భిన్నంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాట్లాడటం విచారకరం అని అన్నారు.