కాగల కార్యం గాంధర్వుడికే తెలుసు. అంటే జరిగే కార్యం గురించి ముందు తెలియడం అన్నమాట. అవును కదా! ఇదే మాటను వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణమరాజు ముందే చెప్పాడు. ప్రభుత్వానికి-రఘురామకి మధ్య ఉన్న వివాదాన్ని పక్కనబెట్టి మాట్లాడితే…అయోధ్య రామజన్మ భూమిలో రామమందిరం శంఖుస్థాపన రోజున కచ్చితంగా టీటీడీ ఎస్వీబీసీ ఛానల్ లో ప్రసారం చేయాలని రఘురామ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు టీడీపీ, బీజేపీ నేతలు కూడా గట్టిగానే తమ గళాన్ని దిక్కులు పిక్కటిల్లేలా వినిపించారు. కానీ టీటీడీ చైర్మన్ గానీ, వైకాపా ప్రభుత్వంగానీ ఆ విధంగా చర్యలు తీసుకోలేదు.
దీనికి వై.వి సుబ్బారెడ్డి ఏమని వివరణ ఇచ్చారంటే? ఆ రోజు స్వామివారి కార్యక్రమాన్నిప్రత్యక్ష ప్రసారం చేయడానికి కేవలం ఎస్వీబీసీ ఛానల్ ఒక్కటి మాత్రమే ఉంది. కానీ అయోధ్య రామమందిర కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా 250 ఛానల్స్ ఉన్నాయి. అవన్నీ కవర్ చేసినప్పుడు…టీటీడీ ఛానల్ కవర్ చేయకపోతే వచ్చిన నష్టం ఏంటి? అన్నట్లే వివరణ ఇచ్చారు. ఈ పరిస్థితిని ముందే ఊహించే రఘురామ, టీడీపీ, బీజేపీ నేతలు డిమాండ్ చేసారు. కానీ వైకాపా అలాంటి చర్యలు తీసుకోకపోగా..ఇచ్చిన వివరణ కూడా హాస్యా స్పదంగా ఉందన్నది పలువురి వాదన. దశాబ్ధాల కాలం పాటు జరిగిన కోర్టుల పోరాటం తర్వాత రామ జన్మభూమి వివాదం ఓ కొలిక్కి వచ్చిన సంగతి ఆ పెద్దలకు తెలియదా? రెండు మతాల మధ్య ప్రత్యక్షంగా జరిగిన యుద్ధం ఇది.
హిందు మత దేశమైన యావత్ భారత్ ఎంతో గొప్ప దైవ కార్యంగా భావించింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో భధ్రాచలం లాంటి రాముని దేవాలయం శతాబ్ధాల క్రితమే వెలసింది. ప్రతీ ఏడాది శ్రీరామనవమికి ఎంతో మంది భక్తులు తరలి వెళ్తుంటారు. అలా శ్రీరామనితో ఏపీ ప్రజల పూజలు ఎంతో ప్రత్యేకమైనవి. అలాంటి రామ మందిర దైవ కార్యాన్ని..రోజులో కనీసం కొన్ని గంటలపాటైన ఎస్వీబీసీ ప్రసారం చేయకపోవడం అనే దాన్ని ఏమనాలో! ప్రభుత్వానికి? వై. వి సుబ్బారెడ్డికే తెలియాలి. తిరుమలస్వామి వారి కార్యక్రమాలు రోజు జరుగుతుంటాయి. వాటిపై ప్రత్యక్ష ప్రసారం సహజమే.
ఒక్క రోజు స్వామివారి ప్రత్యక్ష ప్రసారం నిలిపివేసి రామ మందిర శంఖుస్థాపన కార్యక్రమాన్ని కవర్ చేస్తే వెంకన్న స్వామి ఆగ్రహిస్తాడా? లేక ఏమైనా అభ్యంతరం తెలుపుతాడని అలా చేసారో! ఏమో! మరి ఆ దేవునికే తెలియాలి. ఈ వివాదంపై ప్రశ్నించినందుకు బీజేపీ రాష్ర్ట కీలక నాయకుడు విష్ణు వర్దన్ రెడ్డి, సాధినేని యామినీతో పాటు మరో ఆరుగురికి టీటీడీ నుంచి నోటీసులు వెళ్లాయి. అలాగే టీడీపీ, బీజేపీకి చెందిన మరో 40 మందికి కూడా నోటీసులు వెళ్లాయి. మరి ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో. ఇందులో రాజకీయ ప్రయోజనాలు ఉండొచ్చు! కానీ ఏపీ ప్రజల్లో కూడా ఎస్వీబీసీ ఎందుకు ప్రసారం చేయలేదని అసంతృప్తి ఉంది. సామాన్య ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి వీళ్లకి కూడా టీటీడీ నోటీసులు పంపిస్తుందా.