ప్రస్తుత కాలంలో రోజురోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ప్రమాదాల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబ సభ్యులకు తీరని లోటు మిగులుస్తున్నారు. ముఖ్యంగా యువతీ యువకులు సరదాల కోసం మితిమీరిన వేగంతో వాహనాలు నడపటం వల్ల ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇటువంటి విషాద సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం మీద కళాశాలకు వెళ్తున్న విద్యార్థి మితిమీరిన వేగంతో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ప్రమాదానికి గురయ్యాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కిస్మత్‌పూర ప్రాంతంలో నివాసం ఉంటున్న రోహిత్ యాదవ్ (21) అనే యువకుడు అమీర్ పేట్ లోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కూడా కళాశాలకు వెళ్లడానికి తన వద్ద ఉన్న ద్విచక్ర వాహనం మీద కళాశాలకు బయలుదేరాడు. మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న రోహిత్ యాదవ్ కిస్మత్‌పూర్ ఎస్‌బీఐ బ్యాక్ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేయాలని చూశాడు.
ఈ క్రమంలో వెనుక నుండి వస్తున్న మరొక వాహనం రోహిత్ ని వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో రోహిత్ ద్విచక్ర వాహనం నుండి కింద పడి అతని తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను విచారించారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.