దేశంలో రోజురోజుకీ వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. కుటుంబంలో ఎందరు వ్యక్తులు ఉంటే అన్ని వాహనాలు ఉంటున్నాయి. ఇలా వాహనాల సంఖ్య పెరగటం వల్ల ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. వాహనాలు నడిపేవారు రూల్స్ ని అతిక్రమిస్తూ వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా హైవే ల మీద అతివేగంగా వాహనాలను నడపటం వల్ల కూడా ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల వల్ల ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరి కొంతమంది తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడిన కూడా జీవితాంతం వికలాంగులుగా మిగిలిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళితే… హైదరాబాద్ నగర శివారులోని నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టి వారి మీద దూసుకుపోయింది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు టిప్పర్ లారీ కింద ఇరుక్కుపోయారు. ఈ క్రమంలో వారిద్దరూ కాపాడండి అంటూ అర్ధనార్ధాలు చేయటంతో స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని వారిని కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సాంబశివరావు అనే వ్యక్తిని బయటకి తీసి ఆసుపత్రికి తరలించగా సురేష్ అనే మరొక వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వటంతో ఘటన స్థలంలోనే మరణించాడు.
వెంటనే స్థానికులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన ప్రదేశంలో పరిశీలించారు. ప్రమాదం గురించి అక్కడ ఉన్న స్థానికులను విచారించగా…మియాపూర్ నుంచి మహేశ్వరం వైపు వెళ్తున్న టిప్పర్ లారీ అది వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన ఇద్దరు వ్యక్తులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన గురించి బాధితుల కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.