హైదారాబాద్ లో కలకలం…. అమీర్‌‌పేట కోచింగ్ సెంటర్ లో ఉగ్రశిక్షణ?

హైదరాబాద్ లో ఒక్కసారిగా ఉగ్ర కలకలం మొదలైంది. భాగ్యనగరంలో ఉన్నఫలంగా గుజరాత్ ఏటీఎస్‌ (యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌) టీం దర్శనమిచ్చింది. ఇందులో భాగంగా కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇలా ఏటీఎస్ అదుపులో ఉన్నవారిలో ఒక కోచింగ్ సెంటర్ లో సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తితో పాటు 18ఏళ్ల యువతి ఉందని తెలుస్తుంది.

అవును… హైదరాబాద్‌ లోనూ విస్తృత సోదాలు నిర్వహిస్తున్న ఏటీఎస్‌ అధికారులు.. పలు కీలక ప్రాంతల్లో తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాలాపత్తర్‌ కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌ కు తరలించారని తెలుస్తుంది. ఇదే సమయంలో టోలిచౌకి లో నివాసం ఉంటున్న మొహమ్మద్ జవీద్‌ ను ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌‌ పేటలోని ఓ కోచింగ్ సెంటర్‌ లో సాఫ్ట్‌ వేర్ ట్రైనర్‌ గా ఉన్న జవీద్ కి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఏటీఎస్ అనుమానిస్తుందని తెలుస్తుంది.

దీంతో కోచింగ్ సెంటర్ కేంద్రంగా మొహమ్మద్ జవీద్ కార్యకలాపాలపై ఏటీఎస్‌ అరా తీస్తోందని తెలుస్తోంది. ఈక్రమంలో అమీర్ పేటను జల్లెడ పడుతున్నారు ఏటీఎస్ అధికారులు. ఇందులో భాగంగా జవీద్ కోచింగ్ సెంటర్ కు సమీపంలో ఉన్న మరో నాలుగు కోచింగ్ సెంటర్ ల సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. కోచింగ్ మాటున ఉగ్ర శిక్షణ ఇస్తున్నట్లు ఏటీఎస్‌ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

మరోపక్క గుజరాత్‌ లోని ఉగ్రవాద అనుమానితుడితో రామగుండం అమ్మాయి చాట్ చేసిన విషయాన్ని ఆ రాష్ట్ర ఏటీఎస్ అధికారులు గుర్తించారట. దీంతో హుటాహుటిన రామగుండంలో వాలిపోయిన ఏటీఎస్ అధికారులు ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించారని సమాచారం. ఈ యువతి వయసు 18 ఏళ్ళు అని తెలుస్తుంది. ఈమె ఆరోతరగతి వరకూ చదివి ఆపేసిందని ఆమె తల్లితండ్రులు చెబుతున్నారని సమాచారం.