జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది మీద తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు. జబర్దస్త్ షోలో భాగంగా వేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ అనే స్కిట్లో గౌరవమ్మ, బతుకమ్మ పదాలను కించపరిచే రీతిలో ప్రయోగించి తెలంగాణ సంస్కృతిని అవమానించారనేది వారి ఆరోపణ. జబర్దస్త్ షో మీద ఈ తరహా ఆరోపణలు మొదటిసారి కాదు. గతంలో చాలసార్లు చాలా సంఘాల వారు ఈ అలిగేషన్స్ చేయడం జరిగింది. ఆర్టిస్ట్ వేణు మీద భౌతిక దాడి కూడ జరిగింది. అయినా జబర్దస్త్ ఆర్టిస్టులు తగ్గట్లేదు. తరచూ స్కిట్లతో వివాదాల్లో ఉంటున్నారు. గతంలో వచ్చిన వివాదాలన్నీ రెండు మూడు రోజులకి సమసిపోయేవి.
కానీ హైపర్ ఆది మీద రేగిన ఈ వివాదం అంత ఈజీగా చల్లబడేలా కనిపించట్లేదు. కేసీఆర్ కుమార్తె కవిత నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణ జాగృతి సంఘానికి చెందిన స్టూడెంట్ ఫెడరేషన్ రంగంలోకి దిగడంతో వ్యవహారం పెద్దది అవుతోంది. హైపర్ ఆది క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వివాదం తీవ్రతను గమనించిన హైపర్ ఆది అందరిలానే ఒక వీడియో చేసి క్షమాపణలు కోరడం జరుగింది. తాము ఉద్దేశ్యపూర్వకంగా అవమానించాలని చేయలేదని అంటూ అందరి తరపున సారీ చెప్పారు. అయితే స్టూడెంట్ ఫెడరేషన్ దీంతో సంతృప్తి చెందలేదు. నాలుగు గోడల మధ్యన, వీడియోలో క్షమాపణలు చెబితే సరిపోదని, దీన్ని ఇక్కడితో వదిలేది లేదని, ఆది బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆది నిజంగా బహిరంగ క్షమాపణ చెప్పడానికి బయటికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.