తెలుగు రాజకీయాల్లో కృష్ణా జిల్లా రాజకీయాలకు ప్రత్యేక స్థానం ఉంది. గతంలో అక్కడ ఉన్న వంగవీటి రంగా, దేవినేని నెహ్రుల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ గొడవల కారణంగానే వంగవీటి రంగా చనిపోయారని బెజవాడ వాసులు చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మళ్ళీ స్ట్రీట్ వార్స్ టీడీపీ-వైసీపీ నాయకులు మధ్య మొదలయ్యాయి. కృష్ణా జిల్లాలో మొత్తం 16 నియోజకవర్గాలుంటే అందులో నాలుగు నియోజకవర్గాల్లో నిత్యం వివాదాలు నడుస్తున్నాయి. ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు కేసులు నమోదవుతున్నాయి.
అయితే ఈ గొడవలు కొంత కాలం వరకు కృష్ణా జిల్లాలో కనిపించలేదు అయితే ఇప్పుడు మళ్ళీ వైసీపీ-టీడీపీ నాయకుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ప్రధానంగా గుడివాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నానికి, దేవినేని ఉమ మధ్య గొడవలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇద్దరూ వ్యక్తిగతంగా దూషణలు చేసుకుంటూ కుటుంబ సభ్యులను కూడా ఈవివాదంలోకి లాగుతుండటంతో వీరి మీడియా సమావేశాలు జగుప్సాకరంగా మారాయి. బూతు పురాణాలు వినలేక చెవులు మూసుకోవాల్సి వస్తుంది.
అలాగే మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య కూడా మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని, ఇళ్ల స్థలాల కొనుగోలు విషయంలో కూడా అక్రమాలు జరిగాయని ఉమా ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై చర్చకు కూడా సిద్ధమని వసంత్ బహిరంగ సవాల్ చేశారు.
మచిలీపట్నం నియోజవర్గంలో మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర వర్గాలు ఇప్పటికే ఢీ అంటే ఢీ అంటున్నాయి.మోకా భాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్ర జైలుకు వెళ్లి కూడా వచ్చారు. అలాగే పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పార్థసారధి, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గాల మధ్య మాటల యుధ్ధం జరుగుతుంది. ఇలా కృష్ణా జిల్లా మొత్తం గోడవలతో నిండిపోయింది. ఆ నియోజవర్గాల నుండి ఎప్పుడు ఎలాంటి చెడ్డ వార్త వినాల్సి వస్తుందని ఇరు పార్టీల నాయకులు కంగారు పడుతున్నారు.