కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన కొత్త సాగు చట్టాలకు అడ్రస్ గల్లంతవబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడిస్తూ, మొత్తం రైతు సమాజానికి క్షమాపణ చెప్పారు. రైతుల్ని ఉద్ధరించడానికే.. అంటూనే, ఆ రైతుల్ని ఒప్పించలేకపోయామంటూ ప్రధాని అసహనంతో కూడిన ఆవేదన వ్యక్తం చేశారు.
‘మమ్మల్ని మీరు ఉద్ధరించక్కర్లేదు మహాప్రభో..’ అంటూ రైతులు మొరపెట్టుకుంటున్నా వినకుండా మొండితనానికి పోయిన పాలకులు తెచ్చుకున్న దయనీయ స్థితి ఇది. ఈ వ్యవహారంపై నరేంద్ర మోడీ భక్తులు విలవిల్లాడిపోతున్నారు. అందులో సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మిడిమిడి జ్ఞానం కలిగిన సోషల్ మీడియా మేధావులూ వున్నారు.
‘వీధి పోరాటాలు, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు చేస్తోన్న చట్టాల్ని సవాల్ చేస్తుండడం శోచనీయం..’ అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేసింది. స్వాతంత్ర్య పోరాటం కూడా వీధుల్లోనే జరిగింది.. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన మహోన్నతమైన పోరాటమది.
రైతులది వీధి పోరాటం కాదు.. బతుకు పోరాటం. మొహానికి రంగేసుకుని (ఇలా అనాల్సి వస్తున్నందుకు బాధాకరమే..) తెర మీద తైతక్కలాడే (ఇలా అనాల్సి వస్తున్నందుకు ఇంకా బాధగా వుంది) కంగనా రనౌత్, తమ సినిమా ప్రమోషన్ల కోసం వేసే పబ్లిసిటీ వేషాల్లాంటివి కావు.. ఉద్యమాలంటే.
ఎందరో రైతులు ఈ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారు. ఓ బలమైన ప్రభుత్వాన్ని రైతులు ఢీకొన్నారు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని, చివరికి విజయం సాధించారు. రైతు లేనిదే, ఎవరికీ తిండి దొరకదు. అలాంటి రైతులే తమకు వద్దంటున్న చట్టాల్ని బలవంతంగా రుద్దేసే ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాల్ని సమర్థించే కుహనా మేధావులకు చెంపపెట్టు ఈ తాజా పరిణామం.