అవిశ్వాసంపై చర్చకు ముహూర్తం ఖరారు… తెరపైకి మోడీ బాధ్యతా రాహిత్యం?

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన మణిపూర్ అంశం మాయని మచ్చగా అనే కామెంట్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మోడీ సర్కార్ పై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో సుప్రీం కోర్టు సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్రం చర్యలు తీసుకోని పక్షంలో తాము రంగంలోకి దిగుతామంటూ మోడీ సార్కార్ కి హెచ్చరికలు జారీ చేసింది.

అనంతరం మోడీ ప్రెస్ మీట్ పేట్టారు.. దీంతో రెగ్యులర్ స్టేట్ మెంట్ ఒకటి ఇచ్చారనే కామెంట్లు వినిపించాయి! అనంతరం వర్షాకాల పార్లమెంటు సమావేశాలకు గైర్హాజరవుతున్నారు. దీంతో.. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనే కామెంట్లు దర్శనమిచ్చాయి. ఈ సమయంలో విపక్షాలు పట్టుపట్టాయి.. మణిపూర్ వ్యవహారంపై మోడీ స్పందించాలని పట్టుపట్టాయి.

అవును… పార్లమెంట్‌ లో జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో మణిపుర్ అంశం కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ మణిపుర్ అంశంపై మాట్లాడాలని విపక్ష పార్టీ నేతలు పట్టుబట్టారు. ఇది దేశప్రధానిగా కనీస బాధ్యత అని గుర్తుచేశారు. ప్రధానికి ఇంత బాధ్యతారాహిత్యమా అని కామెంట్లు చేశారు. దీంతో… ఎలాగైనా మోడీని పార్లమెంటుకు రప్పించాలని.. మాట్లాడించాలని పట్టుబట్టారు.

ఈ సమయంలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం అనే అస్త్రాన్ని ప్రయోగించాయి. దీంతో తాజాగా అవిశ్వాస తీర్మానాన్ని చర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. విపక్షల ఎంపీలు ప్రవేశపెట్టిన ఈ తీర్మానంపై ఆగస్టు 8వ తేది నుంచి మూడు రోజుల పాటు ఇందుకు సంబంధించి చర్చ జరగనుంది. దీనిపై ఆగస్టు 10న ప్రధాని మోడీ ప్రసంగం చేయనున్నారు!

దీంతో ఇన్నిరోజులూ పార్లమెంటుకు రాకుండా తప్పించుకు తిరిగిన మోడీ… ఈసారి మూడు రోజుల చర్చకు హాజరుకాకపోయినా.. మూడో రోజు ప్రసంగించడానికైనా హాజరు అవ్వడం తప్పదని అంటున్నారు. దీంతో మణిపూర్ వ్యవహారంపై మోడీ చేయబోయే వ్యాఖ్యలపై తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఇదిలా ఉండగా లోక్‌ సభలో ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల కూటమి “ఇండియా”కు మాత్రం 144 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. విపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానంపై గెలవడం సాధ్యం కాదని తెలిసినప్పటికీ… ప్రధాని మోడీతో మణిపుర్ అంశంపై మాట్లాడింపచేయాలనే ఆలోచనతోనే దీన్ని ప్రవేశపెట్టారు!