శాసన మండలి రద్దుకి వైసీపీ కట్టుబడి వుందా.?

Still YSRCP committed to Abolition Of Council

Still YSRCP committed to Abolition Of Council

శాసన మండలి అంటే ఖర్చు దండగ వ్యవహారం.. అన్న అభిప్రాయంతో వుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మరెందుకు, శాసన మండలికి వైసీపీ నుంచి అభ్యర్థుల్ని పంపుతున్నట్టు.? ఈ ప్రశ్న సహజంగానే ప్రజల్లో కొంత అయోమయానికి కారణమవుతుంది. కానీ, కేంద్రం ఈ అంశంపై నిర్ణయం తీసుకునేదాకా.. శాసన మండలి అనేది అమల్లో వుంటుంది గనుక.. ఆ శాసన మండలికి సభ్యుల్ని పంపాల్సిన బాధ్యత ‘బలం’ వున్న ఆయా రాజకీయ పార్టీల మీద వుంటుంది. అదికార వైసీపీకే ఎక్కువ అవకాశాలు గనుక, మొత్తంగా శాసన మండలి అంతా ముందు ముందు వైసీపీ కనుసన్నల్లోకి వచ్చేయనుంది.

ఇటీవలే శాసన మండలిలో అధికార వైసీపీ మెజార్టీ సాధించిన విషయం విదితమే. కాగా, శాసన మండలి రద్దు విషయంలో వెనక్కి తగ్గకూడదంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖాస్త్రం సంధించిన దరిమిలా, అధికార వైసీపీ నుంచి కూడా సమాధానం వచ్చినట్లే కనిపిస్తోంది. శాసన మండలి రద్దు విషయంలో వెనక్కి తగ్గేది లేదంటున్నారు వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే, శాసన మండలి రద్దుకి సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విషయంలో తాము చెయ్యగలిగిందేమీ లేదని సజ్జల వ్యాఖ్యానించడం గమనార్హం.

నిజమే, శాసన మండలి వద్దని కేంద్రం అనుకుంటే.. అదెంత పని.. రోజుల వ్యవధిలో జరిగిపోతుంది. నిజానికి, కేంద్రం శాసన మండలి రద్దు విషయమై సానుకూలంగా వుంటే.. ఈ పాటికే ఆ పని జరిగిపోయి వుండాలి. కాగా, శాసన మండలిని రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేసిన వైసీపీ ప్రభుత్వం, ఢిల్లీకి వెళ్ళి.. శాసన మండలి రద్దు వద్దు మొర్రో.. అని మొరపెట్టుకుంటోందన్న విమర్శలు టీడీపీ నుంచి వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలనుకుంటే, యుద్ధ ప్రాతిపదికన ఈ విషయమై కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాల్సి వుంది.