రాష్ట్రంలో ఎంతలా ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వానికి వున్నాగానీ, సంక్షేమ పథకాల అమలు ఆగడంలేదు. క్యాలెండర్ ప్రకారం ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాల పేరుతో నేరుగా లబ్దిదారులకు ఆర్థిక మేలు జరుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రమూ ఈ స్థాయిలో సంక్షేమ పథకాల్ని అమలు చేయడంలేదన్నది నిర్వివాదాంశం. ‘సంక్షేమ పథకాల పేరుతో జనాన్ని సోమరిపోతుల్లా మార్చేస్తున్నారు..’ అనే విమర్శ జగన్ సర్కార్ ఓ వైపు ఎదుర్కొంటున్నా, కరోనా పాండమిక్ సమయంలో జగన్ సర్కార్ అందిస్తోన్న సంక్షేమ పథకాలే ప్రజల్ని కాపాడుతున్నాయన్న ప్రశంసలూ లేకపోలేదు. సంక్షేమాన్ని కొందరు తప్పు పట్టడం కొత్త విషయమేమీ కాదు. కానీ, సంక్షేమ పథకాలే రాజకీయంగా తమ ఉన్నతికి ఉపయోగపడ్తాయని ఎవరు అనుకున్నా, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాక, అనూహ్యమైన రీతిలో సంక్షేమ పథకాల్ని తెరపైకి తెచ్చారు. సంక్షేమంతోపాటే అభివృద్ధినీ చేసి చూపించారాయన. కానీ, 2009 ఎన్నికలకొచ్చేసరికి సీన్ మారింది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో విజయం సాధించినా, బొటాబొటి మెజార్టీనే దక్కింది.. ఈ మాట స్వయంగా వైఎస్సారే చెప్పారు. ‘జనం మనల్ని హెచ్చరిస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాల్ని నమ్మకుంటే సరిపోదు. అభివృద్ధి చేస్తున్నా, ఆ ఫలాలు ప్రజలకు అందాలి..’ అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. దానర్థం, సంక్షేమం కంటే కూడా అభివృద్ధి చాలా ముఖ్యమని. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి అనేది గడచిన రెండేళ్ళలో అస్సలు కనిపించడంలేదు. కరోనా పాండమిక్ కూడా ఇందుకు ఓ కారణం. కానీ, ఇలా చెబితే అది కుంటి సాకు మాత్రమే అవుతుంది. రాష్ట్రంలో చాలా చోట్ల రెండేళ్ళుగా రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా తయారైంది. ఉపాధి రాష్ట్రంలో దొరక్క పొరుగు రాష్ట్రాలకు జనం వలస వెళుతున్నారు. ఈ అంశాలపై జగన్ సర్కార్ వీలైనంత వేగంగా ఎక్కువ ఫోకస్ పెట్టకపోతే, ముందు ముందు వైసీపీకి రాష్ట్రంలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు రాజకీయంగా వస్తాయన్నది నిర్వివాదాంశం.