SpiceJet: ATC సమ్మతి లేకుండానే విమానాన్ని నడిపిన స్పైస్‌జెట్ పైలట్‌..!

SpiceJet: స్పైస్‌జెట్ పైలట్ ATC (Air Traffic Control) నుండి అనుమతి తీసుకోకుండా రాజ్‌కోట్ నుండి ఢిల్లీకి ప్రయాణించినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పైలట్‌ను విధుల నుంచి తొలగించింది స్పైస్‌జెట్. అయితే ఈ వ్యవహారంపై ప్రాథమిక విచారణ కొనసాగుతోంది.

అసలు ఏం జరిగిందంటే.. స్పైస్‌జెట్ విమానం నంబర్ SG3703ని నడిపేందుకు సిద్ధంగా డ్యూటీలో ఉన్నాడు ఓ పైలట్. స్పైస్‌జెట్ విమానం డిసెంబర్ 30న రాజ్‌కోట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే ఈ విమానం బయలు దేరటానికి విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనుమతి ఇవ్వలేదు. అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ నుంచి క్లియరెన్స్ రాకుండానే పైలట్ విమానాన్ని నడిపాడు.

ఈ క్రమంలో జరిగిన సంఘటనపై స్పైస్‌జెట్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి విచారణ అయితే ఇంకా కొనసాగుతూనే ఉందని, పైలట్‌ తప్పా లేక ఏటీసీ తప్పా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు అధికారులు. క్లియరెన్స్ ఇవ్వడం.. లేదా తీసుకోవడంలో ATC ఏదైనా పొరపాటు చేస్తే, లేదా ఏదైనా సాంకేతిక సమస్య ఉందని వెల్లడైతే, స్పైస్‌జెట్ ఈ విషయంలో ఏం చర్యలు తీసుకున్నా అంగీకరిస్తుందని వెల్లడించింది.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి పొందిన తర్వాత మాత్రమే విమానాన్ని రన్‌వే నుండి టేకాఫ్ లేదా ల్యాండింగ్ చేస్తారు. దీని కోసం, పైలట్ ATC నుండి కచ్చితంగా అనుమతి తీసుకోవాలి, అప్పుడు మాత్రమే విమానాన్ని ప్రధాన రన్‌వేపైకి తీసుకువస్తారు పైలట్. అలా జరగనప్పుడు.. అదే సమయంలో విమానం ల్యాండింగ్‌ అయినా.. టేకాఫ్ అయినా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది.