కేంద్రంలో బీజేపీ అధికారంలో వున్నంతకాలం ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదు. ఇదీ వాస్తవం. ఈ విషయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే కాదు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికీ తెలుసు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయాన్ని ఒప్పుకోవాల్సిందే. ఒకప్పుడు పాచిపోయిన లడ్డూలంటూ ప్రత్యేక ప్యాకేజీపై విమర్శలు చేసిన జనసేనాని, ఏ బీజేపీని అయితే విమర్శించారో.. ఆ బీజేపీతోన అంటకాగుతున్నారు. రాజకీయం అంటేనే అంత.
టీడీపీ సంగతి సరే సరి.. అధికారంలో వున్నప్పుడు ప్రత్యేక హోదా దండగైంది.. బీజేపీతో సంబంధం తెగిపోగానే, ప్రత్యేక హోదా మంచిదయ్యింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ప్రత్యేక హోదా విషయంలో నిబద్ధతతో వ్యవహరించడంలేదన్న విమర్శలున్నాయి. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు హయాంలో తమ ఎంపీలతో రాజీనామా చేయించిన వైఎస్ జగన్, ఇప్పుడెందుకు ఆ పని చేయడంలేదు.? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నేమీ కాదు. కేంద్రాన్ని కాదని వైసీపీ ఏమీ చేయలేదు కాబట్టే, వైఎస్ జగన్ చేతులెత్తేశారన్న విమర్శ వుంది.
ప్రత్యేక హోదా విషయంలో వాస్తవాల్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద వుంది. అంతే తప్ప, ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే వుంటామని చెప్పడం వల్ల ప్రయోజనమేంటి.? ఏమీ వుండదు. అటు బీజేపీ పెద్దలకు కోపం రాకూడదు.. ఇతు ప్రత్యేక హోదా ద్వారా వచ్చే రాజకీయ లబ్ది కూడా ఆగిపోకూడదన్నట్లు వ్యవహరించడం.. మంచిది కాదు. ఇదే తీరు ప్రదర్శించి చంద్రబాబు రాజకీయంగా దెబ్బతిన్నారు. ఆ పరిస్థితి వైఎస్ జగన్ తెచ్చుకోకూడదు.