ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమట.. నవ్విపోదురుగాక.!

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా విషయమై కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కావొచ్చు, భారతీయ జనతా పార్టీ కావొచ్చు.. చెప్పిన అబద్ధమే మళ్ళీ మళ్ళీ చెబుతూ వస్తోంది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమట.. ప్రత్యేక హోదా దండగమారి వ్యవహారమట. ప్రత్యేక హోదా కంటే ఎక్కువే రాష్ట్రానికి కేంద్రం సాయం చేసేస్తోందట.

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది బీజేపీ వ్యవహారం ప్రత్యేక హోదా విషయంలో. అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని అడిగిందే భారతీయ జనతా పార్టీ. అప్పుడంటే ప్రతిపక్షంలో వుంది కాబట్టి, బీజేపీకి ప్రత్యేక హోదా అనేది ఓ ముఖ్యమైన అంశంగా కనిపించింది. ప్రతిపక్షంలో వున్నప్పుడే, పెట్రో ధరల పెంపు సామాన్యుడ్ని ఎలా నాశనం చేస్తుందో బీజేపీకి అర్థమయ్యింది.

అధికారంలోకి వచ్చాక పెట్రో ధరలు పెంచేసి సామాన్యుడి నడ్డి విరుస్తోంది బీజేపీ. ఏమన్నా అంటే, పెట్రో ధరల పెంపు వల్ల దేశానికి ఎంతో మేలు.. అని చెబుతోంది. ఇదెక్కడి వింత.? ప్రతిపక్షంలో వున్నప్పుడు ప్రత్యేక హోదా.. ఓ మంత్రమైతే.. ఇప్పుడది దుర్మార్గం అయిపోయింది. ఇదీ బీజేపీ తీరు.

కొత్త వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం యూ టర్న్ తీసుకోక తప్పలేదు. రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అంతలా రైతులు, కేంద్రం మెడలు వంచిన మాట వాస్తవం. మరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుంచి ప్రత్యేక హోదా విషయమై ఆ స్థాయి పోరాట పటిమను ఆశించగలమా.?
ప్రజల సంగతి తర్వాత, కేంద్రం ముందు మెడలు వంచేస్తున్న రాజకీయ పార్టీలు తమ వెన్నుని సరి చేసుకుని.. ధైర్యంగా నిలబడితే, ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? అదే అసలు సమస్య.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ముగ్గురూ కలిసి కూర్చుని, ప్రత్యేక హోదాపై కార్యాచరణ సమిష్టిగా రచించగలిగితే, కేంద్రం దిగిరాకుండా వుంటుందా.? కానీ, అంత చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి ఆశించలేం.

రాజ్యసభ ద్వారా రాష్ట్రానికి సంక్రమించిన ప్రత్యేక హోదా అనే హక్కుని ఆంధ్రప్రదేశ్ పొందలేకపోవడమంటే, దానిక్కారణం.. రాష్ట్రంలోని రాజకీయమే.