జగన్ సర్కార్ ఏడాది పాలన విషయంలో కొన్ని అంశాల్లో ప్రభుత్వం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మాజీ సీఎస్ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం, డాక్టర్ సుధాకర్ వ్యవహారం, ఏబీ వెంకటేశ్వరరావు, ప్రభుత్వ భూములు అమ్మకం సహా పలు అంశాల్లో హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో ఏ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా లేదు. అటు సుప్రీంకోటర్టు హైకోర్టు తీర్పులకు అనకూలంగానే స్పందించింది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలోనూ ప్రభుత్వానికి భంగపాటు తప్పలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం న్యాయస్థానాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. హైకోర్టు ఇచ్చిన అన్ని తీర్పులను తప్పుబట్టారు. కొన్ని తీర్పులను చూస్తున్నాం. రాజ్యంగం కొన్ని హక్కులు, అధికారాలు, బాధ్యతలతో పాటు, హద్దులను కూడా నిర్ణయించింది. ఒకరి దాంట్లో మరొకరు జోక్యం చేసుకోకూడదనీ చెప్పింది. నేరుగా కోర్టుల నుంచే ఆదేశాలొస్తున్నాయి. ఇలా చేయండి..అలా చేయండని కోర్టులే చెబుతున్నాయి. అలాంటప్పుడు ప్రభుత్వాలు ఎందుకు? ప‌్రజలు ఎందుకు? అసెంబ్లీ..పార్లమెంట్ లు ఎందుకు? స‌్పీకర్లు ఎందుకు? ముఖ్యమంత్రులు ఎందుకు? డైరెక్ట్ గా న్యాయస్థానాలే రూల్ చేయోచ్చు కదా అని అసంతృప్తిని వ్యక్తం చేసారు.
న్యాయస్థానాల నుంచే ప్రభుత్వాల్ని, ప్రజల్ని నడపిస్తారా? అని అసహనాన్ని వ్యక్తం చేసారు. రాజ్యాంగం మనపై ఉన్న నమ్మకంతో రాసారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వస్తాయని రాజ్యంగ నిర్మాతలు అప్పుడు ఊహించి ఉండరు. లేదంటే దీనికి కూడా ఓ ప్రత్యామ్నాయ మార్గాన్ని రాసేవారేమోనని సందేహం వ్యక్తం చేసారు తమ్మినేని. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నేరుగా కోర్టు తీర్పులపైనే స్పీకర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం రాజకీయ సహా, న్యాయవాదుల్లో చర్చకొచ్చింది. మరీ ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షం ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.