AP: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక బడ్జెట్ సమావేశాలు కావడంతో దాదాపు 20 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా వైకాపా నేతలు కూడా అసెంబ్లీకి హాజరైన విషయం తెలిసిందే . ఇక జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఒకరోజు మాత్రమే అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి వెళ్లిపోయారు.
ఇలా కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్న ఇప్పటివరకు కూడా జగన్ అసెంబ్లీలోకి అడుగుపెట్టింది లేదు అయితే నేడు ఈయన అసెంబ్లీకి హాజరై కేవలం పది నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉండి బయటకు వెళ్లిపోయారు. ఇలా జగన్ అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోవడం పట్ల ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నేతలు స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే టిడిపి సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి రావడానికి కారణం ఆయన పై అనర్హత వేటుపడుతుందన్న భయంతోనే అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. నిబంధనల ప్రకారం 60 రోజులపాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు పడుతుంది అయితే తనపై ఎక్కడ అనర్హత వేటు పడుతుందోనన్న భయంతోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వచ్చి వెళ్లిపోయారని తెలిపారు.
మరి జగన్ ఈ ఒక్కరోజు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారా లేకపోతే రోజు కూడా వస్తారా అనేది తెలియదు కానీ భయంతో మాత్రమే ఈయన వచ్చారని సోమిరెడ్డి వెల్లడించారు. అదేవిధంగా పదకొండ స్థానాలు సంపాదించుకున్న వైసీపీకి ప్రతిపక్ష హోదానే లేదు అలాంటిది తన పార్టీకి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ తీరుపై విమర్శలు కురిపించారు.