Assembly: అసెంబ్లీకి బీఆర్ఎస్ బైకాట్..? సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో పొలిటకల్ హీట్..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రోజురోజుకీ రాజకీయ ఉద్రిక్తతలకు వేదికగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, శుక్రవారం జరిగిన పరిణామాలు మరింత ఆసక్తి రేపాయి. ముఖ్యంగా మూసీ అంశంపై జరిగిన చర్చ బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. మూసీ ప్రాజెక్టు అంశంపై సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం ప్రసంగం అనంతరం ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ ఆరోపించింది. సభా నియమాలను పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడిన బీఆర్ఎస్ సభ్యులు నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ ఘటనతో సభలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

వాకౌట్‌తోనే ఆగకుండా అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బైకాట్ చేసే దిశగా బీఆర్ఎస్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. సభకు హాజరైనప్పటికీ మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రతిపక్ష స్వరాన్ని అణచివేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని బీఆర్ఎస్ సభ్యులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అసెంబ్లీ బయట ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విధానాలపై పోరాటాన్ని ఉద్ధృతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే రేపు ఉదయం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కృష్ణా నదీ జలాల పంపిణీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

ప్రభుత్వం కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించిందని, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కావాలనే నిర్లక్ష్యం చేస్తోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఈ అంశాలపై స్పష్టమైన డేటాతో ప్రజల ముందుకు వెళ్లాలని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల మధ్యలోనే బీఆర్ఎస్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుగా మారింది. అధికార–ప్రతిపక్షాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత రాబోయే రోజుల్లో మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.