AP: ప్రతిపక్షం పోస్ట్ మీరు తీసుకుంటారా… పవన్ కు కౌంటర్ ఇచ్చిన వైసీపీ!

AP: వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాను అసెంబ్లీకి వస్తానని మాట్లాడుతున్నారు ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు తనకు ఓటు శాతం బట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటే ఆయన జర్మనీకి వెళ్లాలంటూ సెటైర్లు వేశారు. ఇలా వైసీపీ నేతలందరూ కూడా తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతున్న నేపథ్యంలో పవన్ వేసిన సెటైర్లపై వైసీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ… టిడిపి తర్వాత అత్యధిక సీట్లు వచ్చిన పార్టీ జనసేన పార్టీ. జనసేనకు విపక్ష హోదా అడిగే హక్కు ఉందని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ అంతలా ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుని ఉంటే కనుక కూటమి నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించవచ్చు అంటూ సతీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల్లో గెలుపొందిన నాలుగు పార్టీల్లో మూడు పార్టీలు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి మాత్రమే ఉంటుందని తెలిపారు.

ఇక జగన్మోహన్ రెడ్డి వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల సమస్యలను చట్టసభలో ప్రశ్నించే అవకాశం ఉంటుందన్న కారణంతోనే ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని తెలిపారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్థం లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని సతీష్ రెడ్డి తెలిపారు. మూడు పార్టీలు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పుడు తమ పాలనలోని వైఫల్యాలను వారే సభలో ప్రభుత్వాన్ని ఎలా నిలదీయగలరని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటేనే ఏ సభకైనా సార్థకత లభిస్తుందని తెలిపారు.

వైసిపికి ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు ఒరిగిపోయేది ఏమీ లేదని తెలిపారు.ప్రశ్నించే ప్రజల గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పే బాధ్యత పవన్ కళ్యాణ్‌కి లేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామిక స్పూర్తి గురించి పవన్ కు కనీస అవగాహన కూడా లేదని దీనిని బట్టి అర్థమవుతోందన్నారు. అంతగా ప్రతిపక్ష పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ కు ఉత్సాహంగా ఉంటే ఆయన తక్షణం ప్రభుత్వం నుంచి బయటకు రావాలి అంటూ ఈయన డిమాండ్ చేశారు.