అసెంబ్లీలో ఆమోదం పొందిన సీఆర్ డీఏ, పాలన వికేంద్రీకరణ బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపడం..అటుపై అదే మండలని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో టీడీపీ కోర్టుకు వెళ్తోంది. చట్టపరంగా అన్నింటిని అడ్డుకుని తీరుతామని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అండ్ కో గట్టిగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై స్పీకర్ తమ్మినేని సీతారం శ్రీకాకుళంలో జరిగిన మీడియా సమావేశంలో స్పందించారు. చంద్రబాబు కోర్టుకెళ్లినా పర్వాలేదు. ఇంకెక్కడికి వెళ్లినా పర్వాలేదు. అంతా చట్ట ప్రకారమే జరుగుతోంది. ప్రభుత్వం భయపడాల్సిన పనిలేదు.
భూమి బద్దలై..ఆకాశం విరిగి మీద పడలేదు కదా! అని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు తొలి నుంచి అవివేకంగానే ప్రవర్తిస్తు న్నారు. శాసన మండలి కేవలం సలహాలకు మాత్రమే. అందుకే దాన్ని పెద్దల సభ అన్నారు. ప్రజల విధాన సభ శాసన సభ అని, అక్కడ తీసుకున్న నిర్ణయాలే తుదిగా పరిగణించబడతాయన్నారు. అసెంబ్లీ నిర్ణయాలను వీటో చేసే అధికారం కౌన్సిల్ కు లేదన్నారు. విధాన సభ సృష్టించిందే దిగువ సభ అని అన్నారు. పెద్దల బుద్ది బాగా పనిచేస్తుందని కౌన్సిల్ ఏర్పాటు చేసారని, ద్రవ్య వినిమియ బిల్లును కూడా ఆపేసారంటే? అది ఎలాంటి సభో అందరికీ తెలుస్తుందని ఎద్దేవా చేసారు.
40 ఇయర్స్ ఇండస్ర్టీ అని చెప్పుకునే పెద్దమనిషి ఎలాంటి పనులు చేయిస్తున్నారో రాష్ర్ట ప్రజలు కళ్లారా చస్తున్నారన్నారు. శాసనసభకు సర్వాధికారాలున్నాయి..అక్కడ తీసుకున్న నిర్ణయాలకు తిరుగుండదు. ప్రస్తుతం చంద్రబాబు అండ్ కో తాత్కాలిక ఆనందం మాత్రమే పొందుతున్నారన్నారు. ఇవన్నీ పగటి కలలు మాత్రమేనన్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా ఆ పెద్ద మనిషికి తెలుసునన్నారు. రాష్ర్ట అభివృద్దికి నిరంతరం పాటు పడుతోన్న జగన్ సర్కార్ కి అడుగడుగునా ఇలాంటి దూతలు అడ్డు తగులుతున్నాయని మండిపడ్డారు.