సౌరవ్ గంగూలీకి మళ్లీ ఛాతీ నొప్పి..హుటాహుటిన హాస్పిటల్ కి తరలింపు

బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. సౌరవ్ గంగూలీ ఇటీవలే ఓసారి ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే.

జనవరి 2న ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా స్వల్ప గుండెపోటు రావడంతో కోల్‌కతాలోని వుడ్ ల్యాండ్ ఆస్పత్రికి తరలించారు. అదే రోజున ఆయనకు యాంజియోప్లాస్టీ సర్జరీ చేశారు. 13 మంది సభ్యుల డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించింది. ఐదు రోజుల చికిత్స అనంతరం జనవరి 7న గంగూలీ డిశ్చార్జి అయ్యారు. ఇక అంతా బాగుందనుకున్న వేళ బుధవారం మరోసారి ఆయన అస్వస్థతకు గురయ్యారు.

ఇటీవలే గంగూలీకి హార్ట్ సర్జరీ చేశారు. ఆయన గుండెలోని మూడు ధమనులల్లో బ్లాకేజ్ కనిపించిందని డాక్టర్లు తెలిపారు. ఓ ధమని ఏకంగా 90శాతం వరకు మూసుకుపోయిందని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయనకు స్టెంట్ వేశారు. జనవరి 7న డిశ్చార్జి సమయంలో సౌరవ్ గంగూలీ పూర్తి ఆరోగ్యంతో కనిపించారు. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక అభిమానులకు అభివాదం చేశారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పారు. ఇంతలో ఇలా జరగడం తో ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.