20 ఏళ్ల రివేంజ్ కి వేళాయెరా… గంగూలీ సేనకి కావాలో గిఫ్ట్!

క్రికెట్ వరల్డ్ కప్ – 2023 ఫైనల్ లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. గురువారం జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా గెలిచింది. దీంతో… ఈ నెల 19న అహ్మదాబాద్ లో జరగబోయే ఫైనల్ మ్యాచ్ లో భారత్ తో పోటీపడనుంది. దీంతో 20ఏళ్ల నాటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తెరపైకి వచ్చింది. నాటి చేదు జ్ఞాపకాలు జ్ఞప్తికి వస్తున్నాయి!

తాజాగా జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో సఫారీలను ఓడించడంతో ఆసిస్ వరల్డ్ కప్ – 2023 ఫైనల్ కి చేరుకోగలిగింది. ఫలితంగా ఫైనల్ లో భారత్ తో తలపడబోతుంది. ఈ నేపథ్యంలో… ఆస్ట్రేలియా – భారత్ లు ఫైనల్ లో తలపడి సుమారు ఇరవై ఏళ్లు అయిపోయిన విషయం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా నాటి ఫైనల్ మ్యాచ్ సంగతులు ఒకసారి పరిశీలిద్దాం.

సరిగ్గా 20ఏళ్ల క్రితం 2003 ప్రపంచ కప్ ఫైనల్ లో రీకీ పాంటింగ్‌ సారథ్యంలోని ఆసీస్‌ – గంగూలీ కెప్టెన్సీలోని టీం ఇండియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆసిస్ చేతిలో భారత్ కు పరాభవం ఎదురైంది. గత వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇచ్చిన ఓటమికి తాజాగా రిటన్ గిఫ్ట్ ఇచ్చేసిన టీం ఇండియా… ఫైనల్ లో గెలిచి గంగూలీకి సేనకు గిఫ్ట్ ఇవ్వాలని అంటున్నారు అభిమానులు!

మార్చి 23 – 2003… జోహనస్ బర్గ్ మైదానంలో, భారీ సంఖ్యలో చేరుకున్న వీక్షకుల, టీవీల ముందుకు కూర్చున్న కోట్ల మంది ప్రేక్షకుల సమక్షంలో ఆస్ట్రేలియా, ఇండియా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసిస్… రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 359 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఈ భారీ స్కోర్ లో భాగంగా… ఓపెనర్లు అడం గిల్ క్రిస్ట్ (57), మాథ్యూ హెడెన్ (37) శుభారంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత సెంచరీతో చెలరేగిన కెప్టెన్ రీకీ పాంటింగ్ 120 బంతుల్లో 140 పరుగులు సాధించాడు. కెప్టెన్ కు మరో ఎండ్ లో మార్టిన్ (88) సహకారమందించాడు. ఇక టీం ఇండియా బౌలర్లలో హాల్ఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

అనంతరం 360 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా బ్యాటర్స్ ఛేదనలో ఘోరంగా ఫెయిల్ అయ్యారు! టీం ఇండియా ఓపెనర్ సచిన్ (4) తీవ్రంగా నిరాస పరచగా.. మరో ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 81 బంతుల్లో 83 పరుగులు చేసి, టీం ఇండియా తరుపున ఆ మ్యాచ్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇక మిగిలిన వారిలో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ (47) రాణించగా… తర్వాత గంగూలీ (24), యువరాజ్ సింగ్ (24), దినేష్ మోంగియా (12)లే పెద్ద స్కోర్లు కావడం గమనార్హం! దీంతో 39.2 ఓవర్లలో టీం ఇండియా 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆసిస్ బౌలర్లలో మెక్ గ్రాత్ మూడు వికెట్లు తీసుకుని భారత్ వెన్ను విరిచాడు. ఫలితంగా ఆసిస్ 125 పరుగుల తేడాతో భారీ విక్టరీని అందుకుంది.

ఇది జరిగి సుమారు 20 ఏళ్లు గడిచింది! అప్పటి ఆసిస్ కంటే ఇప్ప్టి రోహిత్ సేన మరింత బలమైన ఫాం లో ఉండటంతో… 20ఏళ్ల నాడు జరిగిన పరాభవానికి ఇప్పుడు రివేంజ్ తీర్చుకునే సమయం వచ్చిందని అంటున్నారు టీం ఇండియా అభిమానులు. ఫలితంగా నాటి గంగూలీ సేనకు గిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నారు! ఏమి జరగబోతుందనేది తెలియాలంటే.. ఈ నెల 19 వరకూ ఆగాల్సిందే!