ఏంటి.. టైటిల్ చూసి షాకయ్యారా? అవును.. నిజమే కదా. సోనూసూద్.. అసలు నువ్వు మనిషివేనా? ఒక మనిషి ఇలా చేస్తాడా ఎక్కడైనా? అది దేవుడికే సాధ్యం. మనుషులకు సాధ్యం కాని పనులను చేసి నువ్వు దేవుడివి అయ్యావు. అందుకే నువ్వు మనిషివి కాదు. దేవుడు ఎక్కడో ఉండడు.. మనిషి రూపంలోనే తిరుగుతుంటాడు.. అని అంటుంటారు కదా.. అది అక్షరాలా నిజం. ఆ దేవుడు నీలో ఉన్నాడు. నీలో ఉన్న దేవుడే ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నాడు. అందుకే నువ్వు మనిషివి కాదు.. ఖచ్చితంగా మనిషివి కాదు. దేవుడివి.
ఏంటి సోనూసూద్ ను అంతలా పొగిడేస్తున్నారు.. అని అంటారా? అవును.. పొగడాల్సిందే. ఇప్పటికే ఆయన ఎంతోమంది సాయం చేసి దేవుడయ్యాడు. అంతెందుకు.. లాక్ డౌన్ సమయంలో ఏ ప్రభుత్వం వలస కూలీలను పట్టించుకుంది. ఎవ్వరూ పట్టించుకోలేదు. వేలకు వేల కిలోమీటర్లు వలస కూలీలు తమ సొంతూళ్లకు కాలినడకన వెళ్తుంటే ప్రభుత్వాలన్నీ చోద్యం చూశాయి కానీ… ఒక్క ప్రభుత్వమన్నా స్పందించిందా? కేంద్రం గురించి చెప్పాల్సిన పనిలేదు. సోనూసూద్ మాత్రం నేనున్నాను.. అంటూ వలస కూలీలను తన సొంత ఖర్చులతో తమ సొంతూళ్లకు తరలించాడు. అంతేనా.. అప్పటి నుంచి తనకు తోచిన సాయం చేస్తునే ఉన్నాడు. ఆయన సాయం చేసే గుణానికి మెచ్చుకోని వాళ్లు లేరు.
తాజాగా మరో సారి తన ఉదారతను చాటుకున్నాడు సోనూసూద్. ఓ బాలుడికి వైద్య ఖర్చులకు 20 లక్షల ఆర్థిక సాయం అందించాడు. పుట్టుకతోనే కాలేయ వ్యాధితో బాధపడుతున్న హర్షవర్ధన్ అనే 6 ఏళ్ల బాలుడి ఆపరేషన్ కోసం 20 లక్షలు సాయం చేశాడు.
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన హర్షవర్ధన్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలుడి తల్లిదండ్రులు ఇప్పటికే వైద్యం కోసం లక్షలు ఖర్చు చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో.. ఆసుపత్రిలో చేర్చారు. కాలేయ మార్పిడి ఆపరేషన్ చేయాలని.. దానికి 20 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు.
దీంతో ఏం చేయాలో పాలుపోని బాలుడి తల్లిదండ్రులు.. సోనూసూద్ హైదరాబాద్ లో షూటింగ్ లో ఉన్నాడని తెలుసుకొని.. వెళ్లి ఆయన్ను కలిశారు. తమ గోడును చెప్పుకున్నారు. దీంతో చలించిపోయిన సోనూసూద్.. వెంటనే బాలుడి వైద్య ఖర్చులన్నీ తాను భరిస్తానని మాటిచ్చాడు. బాలుడి ఆపరేషన్ కోసం అయ్యే 20 లక్షలను బాలుడి తల్లిదండ్రులకు అందించాడు.
వెంటనే బాలుడిని అపోలో ఆసుపత్రిలో చేర్పించి.. చికిత్స ప్రారంభించాలని సోనూసూద్ సూచించాడు. తమ బిడ్డకు పునర్జన్మ ప్రసాదించిన సోనూసూద్ కు ఆ బాలుడి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.