సోనూ సూద్.. నిజంగా దేవుడేగానీ.

Sonu Sood, The Real God In Pandemic Times

Sonu Sood, The Real God In Pandemic Times

వెండితెరపై విలనిజం.. అందునా భయంకరమైన విలనిజం ప్రదర్శించిన సోనూ సూద్, కామెడీ విలనిజం కూడా పండించాడు. అది ఆన్ స్క్రీన్ వ్యవహారం. నిజ జీవితంలో సోనూ సూద్.. దేవుడి లాంటోడు. ‘లాంటోడు’ కాదు, నిజంగానే దేవుడని ఆయన ద్వారా సాయం పొందిన వేలాది మంది చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో సోనూ సూద్ సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. కరోనా వల్ల జీవితాలు తల్లకిందులైపోయాయని ఎవరన్నా అడిగితే చాలు, ఆర్థిక సాయం.. చేయడమొక్కటే కాదు, ఉపాధి అవకాశాలు కూడా కల్పించేస్తున్నాడు. ఓ మహిళను అర్జంటుగా పూణే నుంచి హైదరాబాద్ తరలించాల్సి వస్తే, మెడికల్ అంబులెన్స్ ఏర్పాటు చేయించాడు.. అదీ వాయుమార్గంలో.

ఇక, తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు మెహర్ రమేష్, ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఓ వ్యక్తికి అవసరమైన మందుల కోసం సోనూ సూద్ సాయం తీసుకున్నాడు. అదేంటీ, మెహర్ రమేష్.. తెలుగు సినీ పరిశ్రమలో ఓ ప్రముఖ వ్యక్తి కదా.. ఆయనకి రాజకీయ నాయకులతోనూ పరిచయాలున్నాయి కదా.. ఆయనేంటీ, సోనూ సూద్ సాయం కోసం ఎదురు చూడటమేంటి.? అన్న డౌట్ ఎవరికైనా రావొచ్చు. కానీ, ఇది డౌట్స్ తెచ్చుకునే సమయం కాదు. అవతల ఓ వ్యక్తి ప్రాణాలతో పోరాడుతున్నాడు. అయినాగానీ, సోనూ సూద్.. ఇలా ఎలా సాయం చేయగలుగుతున్నాడు.? అస్సలు అందుబాటులో లేని మందుల్ని వెంటనే ఎలా సోనూ సూద్ సేకరించి పంపగలగుతున్నాడు.? ఎయిర్ అంబులెన్స్ ఏర్పాటు చేయించేందుకోసం సోనూ సూద్ నిధులు ఎలా సమీకరించగలుగుతున్నాడు.? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు. కొందరు డబ్బులుండీ చెయ్యలేకపోతున్నారు.. సోనూ సూద్, ఇతరుల్ని ఆదుకునేందుకు తన ఆస్తుల్ని సైతం విక్రయానికి పెడుతున్నాడు. దేశంలో చాలామంది సెలబ్రిటీలున్నారు.. వాళ్ళంతా ఈ విపత్తు వేళ.. ముందుకొస్తే, దేశం కరోనా నుంచి చాలా వేగంగా బయటపడుతుంది.