సోనూ సూద్ కరోనాతో ఇబ్బందులు పడుతున్న అనేక మందికి సహాయం చేస్తున్న సంగతి తెలిసిందే. బెడ్స్, ఆక్సిజన్, మందులు, ట్రీట్మెంట్ ఇప్పించడం, వసతులు ఏర్పాటు చేయడం ఇలా అనేక రకాలుగా సోనూ సహాయం అందిస్తున్నారు. తన వద్దకు వస్తున్న ఒక్కొక్కరి ప్రాణాలను కాపాడటానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు ఆయన. అలా సోనూ సూద్ భారతి అనే పాతికేళ్ల యువతిని కాపాడటం కోసం ఎంతో శ్రమించారు. నాగ్ పూర్ ప్రాంతానికి చెందిన ఆమె కరోనాకు గురై మృత్యువుతో పోరాడుతుంటే సోనూ ఆమెను ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ తీసుకొచ్చారు.
అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేసి కీలకమైన ఎక్మో ద్వారా చికిత్స చేయించారు. సుమారు 15 రోజుల పాటు ఎక్మో ట్రీట్మెంట్ ద్వారా ప్రాణాల కోసం పోరాడిన భారతి చివరకు కన్నుమూసింది. అది సోనూ సూద్ ను తీవ్రంగా కలిచివేసింది. భారతిని నాగపూర్ నుంచి హైదరాబాద్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో తీసుకొచ్చాం. నెల రోజుల పాటు మృతువుతో పోరాటం చేసి శుక్రవారం భారతి కన్నుమూసింది. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలుపుతున్నాను. ఆమెను బతికిస్తామని అనుకున్నాను. కానీ జీవితం చాలా అన్యాయమైంది’ అంటూ తన ఆవేదనను పంచుకున్నారు. భారతి కోసం సోనూ సూద్ పడ్డ కష్టాన్ని చూసి ఆమె బ్రతకాలని ప్రార్థించిన లక్షలాది మంది ఆమె మరణ వార్త విని విచారం వ్యక్తం చేస్తున్నారు.