Shefali Jariwala: కాంటా లగా ఫేమ్‌ షఫాలీ మృతి పట్ల అనుమానాలు.. అసలు విషయం చెప్పిన పోలీసులు!

Shefali Jariwala: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో కాంటా లగా సాంగ్ ఫేమ్ నటి షఫాలీ జరివాలా మృతి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆమె మరణంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలోని వారు షాక్ అయ్యారు. ఆమె మృతి అభిమానులతో పాటు సెలబ్రిటీలకు కూడా చేసిందని చెప్పాలి. అయితే మొదట ఆమె కార్డియాక్ అరెస్టుతో మరణించినట్లు వార్తలు వినిపించాయి. కానీ దీనిపై తాజాగా ముంబై పోలీసులు స్పందించారు. ఈ మేరకు పోలీసులు మాట్లాడుతూ..అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఘటన గురించి మాకు సమాచారం వచ్చింది.

అంధేరీలోని షఫాలీ నివాసంలో ఆమె మృతదేహాన్ని పరిశీలించాము. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృత దేహాన్ని కూపర్‌ హాస్పిటల్‌ కు తరలించాము. మరణానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు అని ముంబయి పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె అపార్ట్‌మెంట్‌ ను ఫోరెన్సిక్‌ నిపుణులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అటు పోలీసులు కూడా ఇంట్లో సోదాలు చేస్తున్నారు. వంట మనిషి, ఇంట్లో పనిచేసే వారిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసును అనుమానాస్పద ఘటనగానే పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ ఉదయం షఫాలీ భర్త పరాగ్‌ త్యాగీ అపార్ట్‌మెంట్‌ బయట పెంపుడు శునకంతో నడుస్తూ కనిపించారు.

అయితే నిన్న రాత్రి షఫాలీ అస్వస్థతకు గురవడంతో పరాగ్‌ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె కార్డియాక్‌ అరెస్టుతో మృతిచెందినట్లు తొలుత వార్తలు వచ్చినప్పటికీ కుటుంబ సభ్యులు దాన్ని ధ్రువీకరించలేదు. శుక్రవారం రాత్రి 11.15 గంటలకు ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మరి ఈ కేసులో ఇంకా కీలక విషయాలు తెలియాల్సి ఉంది. మరి నిజంగానే ఆమెది కార్డియాక్ అరెస్టు మరణమా లేదంటే మరింకేదైనా కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.