మరోసారి సోనూసూద్‌ సాయం !

నటుడు సోనూసూద్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సారంగి వాయిద్యకారుడిని ఆదుకునేందుకు ముందుకొచ్చారు. ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్‌కు స్పందించిన సోనూసూద్‌.. సారంగి వాయిద్యకారుడికి సాయం చేస్తానని రీట్వీట్‌ చేసి మరోసారి అందరి హృదయాల్లో వాహ్.. అనిపించారు.

హర్యానాకు చెందిన సారంగి వాయిద్యకారుడు మమన్‌ ఖాన్‌ (83) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. హిసార్ జిల్లా ఖరక్ పునియా గ్రామానికి చెందిన మమన్ ఖాన్ తన సంగీతంతో దేశ విదేశాల్లో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్రపతి అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాదు హర్యానా ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అతనికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

దీంతో ఇంద్రజిత్‌ బర్కే అనే వ్యక్తి ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. మమన్‌ ఖాన్‌ అనారోగ్యంతో ఉన్న ఫొటోను సైతం పోస్టుకు జతచేసి.. ఆర్థిక పరిస్థితిని వివరించాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన రియల్‌ హీరో అతనికి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. “ఖాన్ సాహిబ్, మొదట మీ ఆరోగ్యం నయం చేస్తా. ఆ తర్వాత మీ సారంగి పాట వింటా” అని రీట్వీట్ చేసి అతడికి ఊరటనిచ్చారు. దటీజ్.. రియల్‌ హీరో సోనూసూద్‌!!