Sonu Sood: గతేడాది కరోనా సమయంలో మొదలైన సోనూసూద్ దాతృత్వం ఇప్పటికీ.. సెకండ్ వేవ్ లో కూడా కొనసాగుతూనే ఉంది. కాలినడకన పయనమైన వలస కూలీలను బస్సుల్లో స్వస్థలాలకు చేరవేయడమే కాదు.. తన హోటల్ ని ఫ్రంట్ లైన్ వారియర్లకు ఇచ్చాడు. ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి కల్పించాడు. ఆరోగ్యం బాలేదని సాయం కోరితే వైద్యం చేయించాడు.
ఎద్దులు, ట్రాక్టర్ లేక ఇద్దరు అమ్మాయిలు పొలంలో కష్టపడుతుంటే గంటల్లో ట్రాక్టర్ ఇచ్చాడు. గ్రామానికే ఇంటర్నెట్ ఇప్పించాడు. ఇలా ఎన్నో దాతృత్వాలతో అతడి ప్రస్థానం కొనసాగుతోంది. అయితే.. సోనూ సాయాన్ని అలుసుగా తీసుకున్న ఓ నెటిజన్ కోరిన ఓ చిలిపి కోరకకు అంటే కొంటెగా.. తిరుగులేని కౌంటర్ ఇచ్చాడు సోనూ.
’భాయ్.. నా గర్ల్‌ఫ్రెండ్ ఐఫోన్ కొనివ్వమని అడుగుతోంది. మీరేమైనా సాయం చేస్తారా’ అంటూ సోనూను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. అందుకు సోనూసూద్.. ’అదేమో నాకు తెలీదు కానీ.. నేను ఐఫోన్ కొనిస్తే మాత్రం నీ దగ్గర ఏమీ మిగలదు’ అంటూ ఫన్నీగా.. కౌంటర్ ఇచ్చాడు. దీంతో ఆ నెటిజన్ నుంచి మరి సమాధానమే లేకుండా పోయింది.
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట బాగా వైరల్ అయింది. సోనూసూద్ చేసే సాయానికి ఎందరిలోనో ఓ భక్తిభావం ఉంది. ఆయన్ను దేవుడిగా కొలుస్తున్నారు.. కీర్తిస్తున్నారు. కానీ.. కొందరు ఆకతాయిలు ఇలాంటి మెసేజెస్ ఇవ్వడం నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. పలువురు ఆ యూజర్ పై ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. భలే కౌంటర్ ఇచ్చావంటూ సోనూకు రిప్లైస్ ఇస్తున్నారు.