దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు అనూహ్యమైన తీర్పునిచ్చారు. గట్టి పోటీ ఇస్తుందనుకున్నబీజేపీ ఏకంగా అధికార పార్టీ తెరాసను మట్టికరిపించింది. ఈ పరిణామంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురికీ దిమ్మ తిరిగిపోయింది. బీజేపీకి అయితే ఇక తెలంగాణలో భవిష్యత్తు మాదే అనేంత ధైర్యం వచ్చింది. తెలంగాణ బీజేపీ పెద్దలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, రాజాసింగ్ సగర్వంగా విజయం మాదేనని చెప్పుకుంటున్నారు. ఇలా తెలంగాణ బీజేపీలో సంబరాలు మిన్నంటగా ఏపీ బీజేపీకి మాత్రం చెమటలు పడుతున్నాయి. ముఖ్యంగా కొత్త అధ్యక్షుడు సోము వీర్రాజు పెద్ద సమస్యలోనే చిక్కుకున్నారు.
కన్నా లక్ష్మీనారాయణను కాదని అధిష్టానం సోము వీర్రాజును అధ్యక్షుడిని చేసింది. పదవి దక్కిన ఊపులో సోము వీర్రాజు 2024లో అధికారం మాదే అంటూ పెద్ద సవాల్ విసిరారు. అయితే అధికారం కష్టమని బీజేపీ అగ్రనాయకత్వానికి కూడ తెలుసు. అందుకే ముందు తెలుగుదేశం పార్టీని అధిగమించి ప్రధాన ప్రతిపక్ష హోదా తెచ్చుకోమని సూచించింది. బీజేపీ నేత రాంమాధవ్ సైతం తమ టార్గెట్ తెలుగుదేశం పార్టేనేనని అన్నారు. అంటే సోము వీర్రాజు పనంతా ప్రతిపక్షం మీద పైచేయి సాధించడమే. నిజానికి అదంతా ఈజీ అయినా పని కాదు. తెలుగుదేశం భారీ ఓటమిని చవిచూసి ఉండవచ్చు కానీ ఓటు బ్యాంకును మాత్రం పెద్దగా కోల్పోలేదు. దాన్ని ఛేదించడం కూడ చాలా కష్టం. ఎందుకంటే అది దశాబ్దాల తరబడి టీడీపీ వెంట ఉన్న కేడర్.
అలాంటి టీడీపీ మీద సోము వీర్రాజు నెగ్గుకురావాల్సి ఉంది. మామూలుగా అయితే ఈ ప్రక్రియలో విఫలమైనా వీర్రాజుగారి మీద మరీ అంత ఒత్తిడి ఉండేది కాదు కానీ ఇప్పుడు దుబ్బాకలో బీజేపీ అధికార పక్షాన్ని పడగొట్టడంతో ఒత్తిడి పెరిగిపోయింది. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ మీద వీర్రాజు నెగ్గుకురాలేకపోతే పక్క రాష్ట్రం తెలంగాణలో బీజేపీ అధికార పక్షాన్నే గడగడలాడించింది. అలాంటిది ఏపీలో మాత్రం కనీసం ప్రతిపక్షం మీద కూడ గెలవలేకపోతున్నారు అంటూ హైకమాండ్ నుంచి మాటల దాడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే ఇప్పుడు సోము వీర్రాజుగారి గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది.