రాజకీయ నాయకులకు ఏమున్నా లేకపోయినా పబ్లిసిటీ మాత్రం తప్పనిసరి. అది లేకపోతే వారికి రోజు గడవదు, రాజకీయాలు నడవవు. అందుకే ప్రచారం కోసం తపిస్తుంటారు. కొందరు నేతలైతే రాష్ట్రం దాటి జాతీయ స్థాయిలో ప్రచారం కోరుకుంటుంటారు. అందులో తప్పులేదు. సొంత డబ్బులు పెట్టుకుని రాష్ట్రం, దేశం కాదు ఇతర దేశాల్లో కూడ పబ్లిసిటీ తెచ్చుకోవచ్చు. కానీ సొంత ప్రచారానికి కూడ ప్రజాధనం వాడేస్తాం అంటేనే విడ్డూరంగా ఉంది. గతంలో చంద్రబాబు ప్రచారాలకు, ఏసీల నడుమ చేసిన దీక్షలకు ఎంతెంత ప్రజాధనం తగలబెట్టారో అందరం చూశాం. వైసీపీ నేతలు కూడ ఆ టైంలో చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు.
అలాంటి వారే ఇప్పుడు ప్రచారం కోసం ప్రజాధనం వెచ్చిస్తుండటం ఆశ్చర్యంగా ఉందనేది ప్రజల వాదన. తాజాగా ఏపీ ప్రభుత్వం ఒక జాతీయ మీడియా సంస్థకు 8.15 కోట్లు చెల్లించారు. ఈ మొత్తం ఎందుకయ్యా అంటే రాష్ట్రం, రాష్ట్ర నాయకుల ఇమేజ్ ను జాతీయ స్థాయిలో పెంచడం కోసమని చెబుతున్నారు. ఈ ఒప్పందంలో సదరు మీడియా సంస్థ ప్రభుత్వ విధానాలను, సంక్షేమ పథకాలను గురించి దేశం మొత్తం చెబుతుందట. చెప్పడం, చెప్పించడం మంచిదే కానీ మరీ ఇంత ఖర్చుపెట్టాలా అనేది కొందరి వాదన. అసలే ప్రభుత్వం ఆర్ధిక కష్టాల్లో ఉంది. ఉన్న నిధుల్ని ఆచితూచి వెచ్చించాలి. ముందు ప్రజల అవసరాలు, ప్రభుత్వ నిర్వహణ చూడాలి.
అంతేకానీ సమాచార శాఖ వద్ద నిధులు లేకపోయినా ఇలా అడ్జెస్ట్ చేసి మరీ ఇవ్వడం సరైనదేనా అనే అనుమానం కలుగుతోంది జనంలో. ఏదైనా పథకాలు, ప్రాజెక్టులు మొదలుపెట్టినప్పుడు ఇలా ప్రకటనలు ఇవ్వడం మామూలే. కానీ ప్రత్యేకంగా ప్రభుత్వం గురించి, నేతల గురించి చెప్పమని పేమెంట్ చేశారు. అయినా మంచి పనులు, పారదర్శక రాజకీయాలు, సుపరిపాలన చేసేప్పుడు ప్రచారం చేయించుకోవాల్సిన పనిలేదు. అదే వస్తుంది. ఉదాహరణకు జగన్ మొదలుపెట్టిన వాలంటీర్ వ్యవస్థ. దీని గురించి దేశం మొత్తం మాట్లాడింది. ప్రత్యేకించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. దానికోసం డబ్బేమీ ఖర్చు పెట్టలేదు. మంచి పనుల పవర్ అది. చెప్పుకోకున్నా అందరికీ తెలిసిపోతుంటాయి.