పవన్ కళ్యాణ్ రాజకీయ రంగం ప్రవేశం ఏదో హడావుడిగా జరిగిన పరిణామం కాదు. ఏళ్ల తరబడి చేసుకున్న విశ్లేషణ, సుధీర్ఘ పరిశీలనతో పవన్ గత ఎన్నికల్లో పోటీకి దిగడం జరిగింది. చాలామంది ఇతర పార్టీల నాయకులు, రాజకీయ విశ్లేషకులు పవన్ తొందరపడి రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆయన భంగపాటు తప్పదని అన్నారు. ఇక రాజకీయ పక్షపాత మీడియా అయితే పవన్ తన గురించి తాను మరీ ఎక్కువగా ఊహించుకుని పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారని, చొక్కా నలగకుండా సినిమాలు చేసుకునేవాడు రాజకీయాల్లో పచ్చడైపోతాడని కథనాలు, డిబేట్లు వండి వాడ్చారు. మొత్తం మీద పవన్ పగటి కలలు కంటున్నాడని, అవేవీ నెరవేరవని, పార్టీ పెట్టిన రెండు మూడేళ్లలో ఆయన పార్టీని మూసి తట్టా బుట్టా సర్దుకుంటారని అన్నారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉనికి చాటుకుంటున్నారు.
అధికారం ఇప్పుడే అందని పవన్‌కు తెలుసు:
రాజకీయాల్లో ఉన్నాడు సరే.. ఏం సాధించాడు ? పోటీ చేసిన రెండు స్థానాల్లో కనీసం ఒక్కటి కూడ గెలవలేదు కదా అంటూ ఎద్దేవా చేసేవారికి కూడ ఇక్కడ సమాధానం ఉంది. పవన్ 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంలో ఎంత భూమిక పోషించారో గుర్తుచేసుకోవాలి. ఆయన వల్లనే వైసీపీని తట్టుకుని టీడీపీ అధికారం అందుకుంది. టీడీపీ శ్రేణులకు ఈ వాస్తవాన్ని ఒప్పుకునే మనసు లేకపోయినా అదే నిజం. రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం నుండి తరిమికొట్టాలని పవన్ ఇచ్చిన పిలుపు ఎంత గట్టిగా పనిచేసిందో ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ విచ్చిన్నమైన తీరు చూస్తే అర్థమవుతుంది. 2014 తర్వాత టీడీపీతో విబెధించిన పవన్ 2019 ఎన్నికల వరకు సొంతగానే పార్టీని నడుపుకున్నారు. ఎవరి మద్దతు లేకపోయినా పార్టీని బలోపేతం చేసుకున్నారు.
2019 ఎన్నికల్లో పోటీకి దిగడం వెనుక పవన్ వ్యూహం అధికారమో, పదవులో కాదు. ఎన్నికల ప్రవర్తనను, నియమావళిని, ఓటర్ల మనస్తత్వాలను అర్థం చేసుకోవడమే. అంతేకానీ పోటీచేసిన అన్ని చోట్లా గెలిచేస్తామని, అందరినీ వెనక్కి నెట్టి సీఎం పీఠం ఎక్కాలని కాదు. పవన్‌కు కూడా వాస్తవ పరిస్థితులు తెలుసు. 2019 ఎన్నికల్లో అధికారాన్ని పొందడం అసాధ్యమని తెలుసు. అంతెందుకు కనీసం 10 సీట్లు కూడా రాకపోవచ్చని పవన్ పార్టీ వర్గాలతో అంతర్గత సమావేశాల్లో చెప్పేవారంటే సిట్యుయేషన్ మీద ఆయనకున్న క్లారిటీ ఏపాటిదో అర్థమవుతుంది. కానీ శ్రేణులను ఉత్సాహపరచాలి కాబట్టి అధికారం చేపడతాం అంటూ రెండు మూడుసార్లు బహిరంగ సభల్లో అన్నారే తప్ప తనని తాను నెక్స్ట్ ముఖ్యమంత్రిగా విపరీతమైన రీతిలో ప్రొజెక్ట్ చేసుకోలేదు. కానీ పవన్ ఊహించనిదల్లా రెండు చోట్లా తన ఓటమి. అదే గత ఎన్నికల్లో ఆయన చూసిన అసలు సిసలు పరాజయం అంటే. ఆ పరాజయం వెనుక కూడ రెండు ప్రధాన పార్టీల హస్తం ఎలాంటిదో అధికార పార్టీ ఎంపీ ఒకరు చెప్పనే చెప్పారు.
పవన్‌ను వాడుకోవడం ఇకనైనా ఆపండి :
తాము ఇప్పుడప్పుడే అధికారం అందుకోలేమని పవన్‌కు చాలా ఏళ్ల క్రితమే క్లారిటీ వచ్చింది కానీ ఆయన చుట్టూ చేరిన మీడియాకు, కొందరు వ్యక్తులకే రాలేదు. ఇక్కడ మీడియా అంటే రాజకీయ పార్టీల భజన మీడియా కాదు ద్వితీయ శ్రేణి మీడియా. అదే పలు యూట్యుబ్ ఛానెళ్ళు, వెబ్ మీడియా, సోషల్ మీడియా. వీరంతా పవన్ ఉద్దేశ్యాలను, రాజకీయ లక్ష్యాలను, ఆదర్శాలను గురించి మాట్లాడటం తక్కువ, పవన్‌ను పొగడ్తలతో ముంచెత్తడం ఎక్కువ. పవన్ సీఎం అవడానికి కొత్త ఎత్తులు వేస్తున్నారు, పవన్ దెబ్బకు జగన్, చంద్రబాబులు ఢమాల్, నెక్స్ట్ సీఎం పవనే అంటుంటారు. ఇవన్నీ కేవలం పవన్ అభిమానుల అటెంక్షన్ కోసమే. పవన్‌ను పొగిడితే అభిమానులు కింద మీద అయిపోతారు, మనవైపుకు తిరిగుతారు, మన ఫాలోవర్లు, వ్యూస్, షేర్స్ పెరుగుతాయి. మనం సర్వైవ్ అవ్వడం ఈజీ అనే స్వార్థంతో ఈ భజన కార్యక్రమం చేస్తుంటారు. అలా చేసి ప్రయోజనం పొందినవాళ్లు చాలామందే ఉన్నారు.
అంతెందుకు..ఇటీవల బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు, ఏపీలో అధికారం చేపట్టడమే లక్ష్యమని కషాయ పార్టీ నేతలు మాట్లాడిన మాటలను పట్టుకుని పవన్ మీద తోచినన్ని కథలు అల్లేశారు. ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగానే నెక్స్ట్ ఎన్నికల్లో బీజేపీ, జనసేనల కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని, ఈ దఫా ఆయన సీఎం కావడం ఖాయమని భవిష్యవాణి వినిపించారు. రాజకీయాల్లో రేపటి రోజున ఏం జరుగుతుందో చెప్పాడమే అసాధ్యం. అలాంటిది నాలుగేళ్ల తర్వాత రాబోయే ఎన్నికల గురించి ఇప్పుడే ప్రిడిక్షన్స్ ఇచ్చే వాళ్ళను ఎలా నమ్మడం. ఇవన్నీ పవన్‌కు బాగా తెలుసు. అందుకే జరుగుతున్న పరిణామాల పట్ల అతిగా స్పందించడం లేదు. పార్టీ పనులు, ప్రజాసమస్యలు, అధికార పార్టీ పొరపాట్ల మీదే మాట్లాడుతున్నారు. అంతేకానీ మేము గెలుస్తాం, నేను ముఖ్యమంత్రిని అవుతాను అంటూ అనవసర గొప్పలకు పోవడం లేదు. జనసైనికులు కూడ గతంలో మాదిరి పొగడ్తలకు పొంగిపోవడం మానేసి వాస్తవిక ద్రుష్టితో మెలుగుతున్నారు. కాబట్టి డబ్బా రాయుళ్లు పవన్ కళ్యాణ్ గురించి డబ్బా కొడుతూ పబ్బం గడుపుకునే పనిని ఇకనైనా మానుకుంటే మంచిది.