రాజకీయాల్లో అన్నింటినీ నిర్ణయించేది కేవలం అధికారం మాత్రమే. అధికారం ఉంటేనే ఎవరైనా వస్తారు, ఎవరైనా మనం కోసం నిలబడుతారు. ఒక్కసారి అధికారం పోతే రాజకీయాల్లో ఎవ్వరు పట్టించుకోరు . ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి అదే విధంగా మారింది. గతంలో టీడీపీలో ముఖ్య నేతలుగా ఉన్నవారు కూడా ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు కనీసం పార్టీని కూడా పట్టించుకోకుండా ఉన్న ఈ నేతలను గతంలో చంద్రబాబు నాయుడు నెత్తిన కూర్చోపెట్టుకొని ఊరేగారు.
కనిపించని టీడీపీ కీలక నేతలు
టీడీపీలో చాలామంది నేతలు అస్సలు కనిపించడం లేదు. ఆ నేతలు ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు. వాళ్ళల్లో ముళ్లపూడి బాపిరాజు,మాగంటి బాబు, పీతల సుజాత, కలవపూడి శివ, మొడియం శ్రీనివాస్ లు ఉన్నారు. ఈ నాయకులు టీడీపీ అధికారంలో ఉన్నపుడు తమ హవాను కొనసాగించారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు టీడీపీ పట్టించుకోవడం లేదు. బాపిరాజు 2019 ఎన్నికల్లో తాడేపల్లి నుండి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు కానీ దక్కపోవడంతో ఇప్పుడు రాజకీయాలు దూరంగా ఉన్నారు. అలాగే 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచినా కూడా గృఆప్ రాజకీయాల వల్ల 2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. అలాగే పీతల సుజాత ఇప్పుడు చింతలపూడిలో టీడీపీ పెద్ద ఆప్షన్ గా ఉన్నారు. మరి రానున్న రోజుల్లో టీడీపీ కోసం నిలబడుతారో లేదో చూడాలి. అలాగే శివ గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమిని మూట కట్టుకున్నారు. ఇలా ఈ నేతలు తమకు ఎదురైన చేదు ఘటనల వల్ల పార్టీకి దూరమయ్యారు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారో వేచి చూడాలి.
బాబు కూడా పట్టించుకోవడం లేదా!!
ఈ నేతలకు పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ అధినేత చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నరనేది ఎవ్వరికి అర్ధం కాని విషయం. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ చుట్టూ తిరిగిన నేతలు ఇప్పుడు పార్టీ దీన స్థితిలో ఉన్నప్పుడు బయటకు రావడం లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. వైసీపీని దెబ్బకొట్టడానికి ఎంతో ప్రయత్నిస్తున్న బాబుకు ఈ నేతలు ఎప్పుడు అండగా నిలుస్తారో వేచి చూద్దాం.