తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా తయారు అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పార్టీకి దిశా నిర్దేశం చేసే నాయకుడే కరువయ్యాడు. మొన్నటిదాకా పీసీసీ ప్రెసిడెంట్ గా వ్యవహరించిన ఉత్తమ్ కుమార్ ఆ పదవికి రాజీనామా చేయటంతో ఆ స్థానంలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పగ్గాలు చేప్పట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే పార్టీలోని కొందరు నేతలు రేవంత్ రెడ్డి నియామకాన్ని వ్యతిరేకించడంతో ఆ నిర్ణయం వాయిదా పడింది.
దీనితో పార్టీని నడిపించే నాయకుడు లేక కాంగ్రెస్ నావ దాదాపుగా ఆగిపోయిందనే చెప్పాలి. ఇలాంటి స్థితిలో రేవంత్ రెడ్డి పార్టీ కేడర్ లో ఉత్సహాన్ని నింపే పనిలో పడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా వరస దీక్షలు చేస్తూ కాంగ్రెస్ ఉనికిని చాటే ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. తాజాగా ఆర్మూర్ పసుపు రైతులకు మద్దతుగా దీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి ఈ దీక్షతో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కొంత అలజడి సృష్టించింది. దానికి కొనసాగింపుగా మరొక దీక్ష చేపట్టేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్టు సమాచారం.
ఆర్మూర్ లో చేపట్టిన రాజీవ్ రైతు భరోసా దీక్షకు కొనసాగింపుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో దీక్ష చేపట్టేందుకు సిద్దమవుతున్నాడు.ప్రజల సమస్యలపై పోరాడుతూ కాంగ్రెస్ ను తిరిగి గాడిలో పెట్టాలన్నది రేవంత్ రెడ్డి వ్యూహంలా కనిపిస్తోంది. ఇలా అన్ని జిల్లాలలో రేవంత్ రెడ్డి దీక్షలు చేపట్టే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. ఈ విధంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి అనధికారికంగా పీసీసీ బాధ్యతలు కూడా తీసుకున్నట్లు అర్ధం అవుతుంది. రాష్ట్రంలో కొమ్ములు తిరిగిన కాంగ్రెస్ నేతలందరూ ప్రస్తుతం సైలెంట్ గా ఉంటున్న దశలో రేవంత్ రెడ్డి ఒక్కడే సింగల్ హ్యాండ్ తో పార్టీని లీడ్ చేసుకుంటూ, పార్టీ క్యాడర్ లో ఉత్సహాన్ని నింపుకుంటూ ముందుకు సాగుతున్నాడు, ఈ విషయంలో నిజంగా రేవంత్ రెడ్డి గ్రేట్ అనే చెప్పాలి