బెదిరింపులు, శాపనార్థాలు.. ఇదీ చంద్రబాబు మార్కు రాజకీయం.!

ప్రతిపక్షం, అధికార పక్షాన్ని ప్రజా సమస్యలపై నిలదీయాల్సిందే. అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడితే, ప్రజా క్షేత్రంలో వాటిని కడిగి పారేయాల్సిందే. ఈ క్రమంలో అధికార పార్టీ కూడా తన వాదనను వినిపిస్తుంటుంది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ వుంటుంది. విపక్షాలు దాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి కూడా. కానీ, అదుపు తప్పి చేసే వ్యాఖ్యలు, దుందుడుకు వైఖరి, బెదిరింపులకు పాల్పడటం, శాపనార్థాలు పెట్టడం.. వీటిని ప్రజలు హర్షించరు. కానీ, ఏళ్ళ తరబడి చంద్రబాబు ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. చంద్రబాబు మార్కు రాజకీయం.. అనగానే, అందులో బెదిరింపులుంటాయి, శాపనార్థాలు వుంటాయి. టీడీపీతో పెట్టుకున్నోళ్ళకు పుట్టగతులు వుండవన్నది చంద్రబాబు తాజాగా వదిలిన కొత్త ఆణిముత్యం. నిజానికి, ఇది కొత్తది కాదు.. గతంలోనూ చాలాసార్లు వాడేశారు. ఈసారి కొత్తగా వాడారంతే.

టీడీపీతో పెట్టుకున్న టీఆర్ఎస్ పాడైపోయిందా.? వైఎస్సార్సీపీ పాడైపోయిందా.? బీజేపీ పాడైపోయిందా.? చంద్రబాబు ఇలా ఎన్నాళ్ళు శాపనార్థాలతో కూడిన రాజకీయాలు చేస్తారో ఏమో.? ఇకపోతే, బెదిరింపుల విషయానికొద్దాం. పోలీసు అధికారుల్ని మీడియా సాక్షిగా చంద్రబాబు బెదిరిస్తుంటారు. అదే బాటలో టీడీపీకి చెందిన చాలా మంది నేతలూ పోలీసు అధికారులపై విరుచుకుపడుతున్నారు. అధికార పార్టీ తొత్తులంటూ పోలీసుల మీద విరుచుకుపడుతున్నారు. నిజానికి, ఇదే అధికారులు.. చంద్రబాబు హయాంలోనూ పనిచేశారు. అప్పటి ప్రభుత్వం ఎలా ఆదేశిస్తే, పోలీసులు అలాగే వ్యవహరిస్తారు. వాళ్ళపై వుండే ఒత్తిళ్ళు అలాంటివే. రేప్పొద్దున్న టీడీపీ అధికారంలోకి వస్తే, మళ్ళీ అదే పోలీసులతో సెల్యూట్ చేయించుకోవడమే కాదు, వారిని వెనకేసుకొస్తారు. ఇవన్నీ చంద్రబాబుకి తెలియనివి కావు. తెలిసీ, సీనియర్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు ఇలాంటి వెకిలి రాజకీయాలు చేస్తుంటారంతే.