ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గతంగా చిన్న చిన్న గొడవలుండడం సహజమే. కింది స్థాయిలో నాయకుల మధ్య సఖ్యత లేకపోవడం అనేది ఏ పార్టీలో అయినా చూస్తుంటాం. కానీ, వాటిని నియంత్రించగలిగే స్థాయిలో అధిష్టానం తగు చర్యలు తీసుకోవాల్సి వుంటుంది ఎప్పటికప్పుడు.
స్వర్గీయ వైఎస్సార్ వర్ధంతి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు హంగామా చేశాయి. వైఎస్సార్ విగ్రహాలకు పాలాభిషేకాలు, పూల దండలు వేయడం.. ఇలా చాలా వ్యవహారాలు నడిచాయి. పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు వైసీపీ నేతలు. అయితే, వైఎస్సార్ అభిమానులకీ, వైసీపీ నేతలు కొందరికీ మధ్య అక్కడక్కడా గలాటా చోటు చేసుకుంది.
ప్రధానంగా ఫ్లెక్సీల ఏర్పాటు విషయమై వైసీపీ నేతలు, వైసీపీ అభిమానుల మధ్య గొడవలు జరిగాయి. రచ్చకెక్కారు, కొట్టుకున్నారు కూడా. ‘వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అప్పట్లో తిట్టి, ఇప్పుడు వైసీపీ నేతలుగా చెలామణీ అవుతూ మా మీద పెత్తనం చేస్తున్నారా.?’ అంటూ వైఎస్సార్ అభిమానులు కొందరు, వైసీపీ నేతల మీద మండిపడ్డారు.
రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరిదాకా చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపించింది. అధినేత మెప్పు కోసం వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించాలనే ఆలోచన, దానికి తోడు అత్యుత్సాహం, మీడియా కవరేజీ కోసం పాట్లు.. వెరసి, ఈ వివాదాలకు కారణమవుతున్నాయి.
‘వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తావో చూస్తాం..’ అంటూ పలువురు వైసీపీ ప్రజా ప్రతినిథుల్ని వైఎస్సార్ అభిమానులు నిలదీయడం గమనార్హం. ఈ పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయనే కోణంలో వైసీపీ అధిష్టానం దృష్టిపెట్టకపోతే, అది పార్టీకి చేటు చేస్తుంది.