YCP MLA’s : టీడీపీ గాలానికి చిక్కుతోన్న వైసీపీ ఎమ్మెల్యేలు.!

YCP MLA’s : సరిగ్గా పని చేయకపోతే టిక్కెట్లు రావన్న సంకేతాల్ని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన వైసీపీ శాసనసభా పక్ష సమావేశంలో తేల్చి చెప్పడంతో, టిక్కెట్లు దక్కవన్న ఆలోచనతో వున్న వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ప్రతిపక్షం టీడీపీ వైపు చూస్తున్నారట. నిజమా.? టీడీపీ మార్కు కామెడీనా.? అంటే, దానిపై మళ్ళీ భిన్న వాదనలున్నాయి.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. అదే గనుక జరిగితే, ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో చాలామందికి టిక్కెట్లు దొరకవు. పలువురు మంత్రులు కూడా టిక్కెట్లు కోల్పోయే అవకాశం వుంది. అలాంటివారిలో కొందరు, రాజకీయంగా ప్రత్యామ్నాయ వేదిక వైపు చూడటం మామూలే.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రతిపక్షమంటే తెలుగుదేశం పార్టీనే. పైగా, చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఎప్పుడెలా మారతాయో చెప్పలేం. ఎలక్షనీరింగ్‌లో చంద్రబాబు ఈక్వేషన్స్ చాలా డిఫరెంట్‌గా వుంటాయ్. ఇప్పటినుంచే వైసీపీలో అసంతృప్త నేతలకు గాలమేసే పనిలో చంద్రబాబు వున్నారు.

వైసీపీలో సీనియర్ నేతగా వున్న ఓ ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన నాయకుడ్ని టీడీపీ దువ్వుతోందిట. ఆయన త్వరలో వైసీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా పని చేస్తున్నారట. మంత్రి పదవి వచ్చే అవకాశం లేకపోవడమే అందుక్కారణమని సమాచారం.

ఇది నిజమేనా.? టీడీపీ మార్కు ప్రచారమా.? అన్నదానిపై స్పష్టత రావాల్సి వుంది. నిజమే అయితే, ఇలాంటివి చాలనే ముందు ముందు చూడబోతున్నాం.