Janasena : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారబోతున్నాయా.? అంటే, తాజా పరిణామాలు చూస్తోంటే ఔననే అనిపిస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, జనసేన పార్టీలో చేరేందుకు ‘గ్రౌండ్’ ప్రిపేర్ చేసుకున్నారట. ఎవరా ఎమ్మెల్యే.? ఏమా కథ.? అంటే, ఆయన రాయలసీమ ప్రాంతానికి చెందిన.. అందునా, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అని అంటున్నారు.
ఇటీవల ఓ సందర్భంలో సదరు ఎమ్మెల్యే మాట్లాడుతూ, ‘టీడీపీ అధినేత చంద్రబాబుకి ఇంకో అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదనీ, కొత్తగా వచ్చేవారికి అవకాశం ఇవ్వాలనుకుంటే ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి అవకాశం ఇవ్వడం మంచిదనీ’ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
అయితే, అది మార్ఫింగ్ వీడియోనా.? లేదంటే, నిజమైన వీడియోనా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. గత కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన సినిమా పనుల్లో బిజీగా వున్నారు. పార్టీ వ్యవహారాలకు సంబంధించి సైలెంట్‌గా గ్రౌండ్ వర్క్ అయితే చేసేస్తున్నారుగానీ, ప్రత్యక్షంగా రాజకీయ వేదికలపై కనిపించడంలేదు.
‘వైసీపీ పట్ల అసహనంతో వున్నవారిని గుర్తించండి..’ అంటూ జనసైనికులకు స్పష్టమైన ఆదేశాలు అధినాయకత్వం నుంచి వెళ్ళడంతో, జనసైనికులు తమ పని తాము చేసుకుపోతున్నారు. ఇంకోపక్క, కింది స్థాయిలో వైసీపీ పట్ల వ్యతిరేకత పెరుగుతుండడాన్ని వైసీపీ నేతలే బాహాటంగా చెబుతోన్న పరిస్థితి.
కాగా, వైసీపీ నుంచి ఎవరూ వేరే పార్టీల్లోకి వెళ్ళే సాహసం చేయబోరనీ, జనసేన వైపు అస్సలే చూడరనీ వైసీపీ నాయకత్వం చెబుతోంది. గతంలో అధికారంలో వున్నప్పుడు టీడీపీలో కూడా ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించంది. ఇప్పుడు వైసీపీ అదే అతివిశ్వాసం ప్రదర్శిస్తోందని అనుకోవాలేమో.