ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత గెలిచిన పార్టీల్లో అసంతృప్తులు రాజుకుంటున్నాయి. టీడీపీ సంగతి పక్కనబెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పదవుల కేటాయింపు చిచ్చు రేపుతోంది. గెలిచిన కౌన్సిలర్లు పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు పదవులు రాలేదన్న కోపంతో తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.
జమ్మలమడుగు నగర పంచాయతీలో ఛైర్మన్ పదవి విషయంలో పార్టీలో విభేదాలు భగ్గమున్నాయి. తనకు ఛైర్ పర్సన్ పదవి ఇవ్వలేదన్న అసంతృప్తితో నాలుగో వార్డు నుంచి కౌన్సిలర్ గా విజయం సాధించిన జ్ఞానప్రసూన తన పదివికి రాజీనామా చేశారు. దీంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఛైర్ పర్సన్ పదవి ఇస్తామంటూ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మోసం చేశారని.. ఆమె ఆరోపించారు. ఎక్కువ ఎవరు డబ్బు ఇస్తే వారికే సుధీర్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తారని ఆమె అన్నారు. తన బాటలోనే మరికొంత మంది ఉన్నారని చెప్పారు. సీఎం జగన్ బీసీలకు ప్రాధాన్యత ఇస్తుంటే.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాత్రం.. డబ్బులు ఇచ్చిన వారికే పదవులిస్తున్నారన్నారు. డబ్బుల కోసమే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి డ్రామాలుడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జమ్మలమడుగు నగరపంచాయతీలో మొత్తం 20 వార్డులుండగా.. అందులో 18 వార్డులు వైసీపీ కైవసం చేసుకుంది. 2 వార్డులు బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. నాలుగో వార్డు నుంచి గెలిచిన జ్ఞానప్రసూన ఛైర్ పర్సన్ పదవిని ఆశించగా.. 12వ వార్డు నుంచి గెలిచిన శివమ్మకు పదవి ఇవ్వడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారి కింద తాము పనిచేయలేమని ప్రసూన స్పష్టం చేశారు.