సుప్రీం బెయిల్ షరతుల్ని ఉల్లంఘించిన రఘురామ.?

Shock, Raghurama ,Releases , Video,

Shock, Raghurama ,Releases , Video,

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు చాలా రోజుల తర్వాత పెదవి విప్పారు. అదీ ఓ చిన్నపాటి వీడియో ద్వారా. రాజద్రోహం కేసులో అరెస్టయ్యాక రఘురామ నుంచి ఓ వీడియో విడుదలవడం ఇదే తొలిసారి. రఘురామకు షరతులతో కూడిన బెయిల్ ఇటీవల సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఆ షరతుల్లో అతి ముఖ్యమైనది ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు, మీడియాతో మాట్లాడకూడదు, సోషల్ మీడియా ద్వారా కూడా ఎలాంటి వీడియోలూ విడుదల చేయకూడదని. మరి, రఘురామ ఎలా వీడియో విడుదల చేశారు.? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియోలో పలు అంశాల గురించి రఘురామ మాట్లాడారు. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ సహా, తన మీద నమోదైన కేసుల గురించి మాట్లాడారు రఘురామ.

దాంతో, బెయిల్ షరతుల్ని ఉల్లంఘించారు గనుక, రఘురామకి వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కాగా, రెడ్డి సామాజిక వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు, నిందాపూర్వకమైన విమర్శలు చేశారంటూ రఘురామపై పోలీసులకు తాజాగా ఓ ఫిర్యాదు అందింది. దాంతో, పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే రఘురామ మీద ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అరడజనుకి పైగా కేసులు నమోదయిన విషయం విదితమే. ఆ కేసుల విషయాన్ని వైఎస్ జగన్ తరఫు న్యాయవాదులు సీబీఐ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొనడం గమనార్హం. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన రఘురామ, ఆ తర్వాత పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. వైసీపీ మీద విమర్శలు చేయడం, జగన్ ప్రభుత్వం మీద నిందలు మోపడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీదా వెకిలితనంతో కూడిన వ్యాఖ్యలు చేయడం ద్వారా విపరీతమైన పబ్లిసిటీ పొందారు రఘురామ. ఆయన చేష్టలు శృతిమించడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.