నర్సాపురం లోక్ సభ సభ్యుడు, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.? చాలాకాలంగా ఆయన సొంత నియోజకవర్గం వైపుకు వెళ్ళలేదు. తన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు అనుచరుల నుంచి సమాచారమైతే తెప్పించుకుంటున్నానని చెబుతున్నారుగానీ, ప్రత్యక్షంగా అక్కడి ప్రజలతో సంబంధాల్లేకపోవడం ఆయనకు అతి పెద్ద మైనస్.
‘నా నియోజకవర్గానికి నేను వెళ్ళడానికి లేకుండా పోయింది. అక్రమ కేసులు పెట్టి నన్ను అరెస్టు చేయాలనుకుంటున్నారు. నా మీద భౌతిక దాడులకు వ్యూహ రచన చేశారు. నన్ను అంతమొందించే ప్రయత్నాలూ జరుగుతున్నాయి..’ అని పదే పదే రఘురామ ఆరోపిస్తోన్న సంగతి తెలిసిందే.
రఘురామ పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నర్సాపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని భీమవరంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన జరిగితే, ప్రోటోకాల్ ప్రకారం కూడా రఘురామకు ఆహ్వానం అందలేదు. అంటే, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచిగానీ, బీజేపీ అధినాయకత్వం నుంచిగానీ, రఘురామకి సరైన మద్దతు లేదనే కదా అర్థం.? రఘురామ, టీడీపీతో అంటకాగుతుండడం వల్లే ఈ పరిస్థితి అన్నది కొందరు రాజకీయ విశ్లేషకుల వాదన.
కాగా, అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రఘురామకృష్ణరాజు రాజ్యసభ సీటుని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా బీజేపీ లేదా టీడీపీ నుంచి అట. టీడీపీ ఇప్పట్లో రాజ్యసభ సీట్లను పొందడం చాలా చాలా కష్టం. కానీ, బీజేపీ నుంచి అయితే ఆయనకు కొంత మేర వెసులుబాటు వుండొచ్చు. ఈ క్రమంలో ఆయన ఢిల్లీ వేదికగా చాలా లాబీయింగ్ నడుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది.
లోక్ సభ పదవీ కాలం వచ్చే ఎన్నికలతో రఘురామకి పూర్తవుతుంది. మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడమంటే రఘురామకి అది సాధ్యమయ్యే పని కాదు. ప్రాక్టికల్‌గా కొన్ని విషయాల్ని ఆయన బాగానే లెక్కలేసుకుంటారు. అలా లెక్కలేసుకున్న తర్వాతనే రాజ్యసభ ఆలోచన చేశారన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న వాదన.