సంచలనం.. శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్ట్.!

కేంద్రంలోని మోడీ సర్కారుకి వ్యతిరేకంగా వెళితే ఏమవుతుంది.? ఇంకేమవుతుంది.? ఈడీ వెంటబడుతుంది.. సీబీఐ తరుముతుంది. ఈ విషయం శివసేనకు అర్థమవడానికి పెద్ద సమయమేమీ పట్టలేదు. మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని బీజేపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించి కుప్ప కూల్చిన విషయం విదితమే. ఈ క్రమంలో బీజేపీ మీదా, కేంద్రం మీదా సంజయ్ రౌత్ తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు.

ఆ ఫలితంగానే, ఇప్పుడు ఈడీ ఆయన వెంట పడింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, మనీ లాండరింగ్ కేసులో శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌ని అరెస్టు చేసింది. సంజయ్ రౌత్ ఇంటిలో సోదాలు నిర్వహించిన ఈడీ, అనంతరం ఆయన్ని అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

సంజయ్ రౌత్ అలాగే ఆయన కుటుంబ సభ్యులపై కోట్ల రూపాయల భూ కుంభకోణం ఆరోపణలున్నాయి. చిత్రమేంటంటే, గతంలో ఇదే శివసేనతో కలిసి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఆ తర్వాత బీజేపీ – శివసేన మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయి. శివసేన, బీజేపీయేతర పార్టీలతో జతకట్టి, అధికార పీటమెక్కింది.

అనూహ్యంగా శివసేనను మహరాష్ట్ర పీఠం నుంచి కిందికి లాగేసింది.. ఈ క్రమంలో శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండేని పావులా వాడుకుంది బీజేపీ. ప్రస్తుతం శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ శిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా వున్న విషయం విదితమే.