అమ్మకానికి ఎమ్మేల్యేలు: నయా రాజకీయం ఇది.!

ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడం అనేది కొత్త విషయం కాదు. కాకపోతే, అధికారం ఎక్కడుంటే అటువైపు ఎమ్మెల్యేలు ఆకర్షితులవడం ఇప్పటిదాకా చూశాం. అధికార పార్టీ నుంచి బయటకు వెళ్ళి, ప్రభుత్వాల్ని కుప్పకూల్చేలా అమ్ముడుపోతున్న ఎమ్మెల్యేలను గత కొంతకాలంగా చూస్తున్నాం. ఇదీ నయా మార్పు రాజకీయాల్లో.!

మహారాష్ట్రలో ఉద్ధవ్ ధాక్రే ప్రభుత్వం కుప్పకూలుతోంది. అందుక్కారణం, అధికార కూటమి నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోవడం. కాదు కాదు, అమ్ముడుపోవడం. నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలు అమ్ముడుపోయిన వైనం చూస్తున్నాం. గతంలో తమిళనాడులో ఇలాంటి పరిస్థితే కనిపించింది. కర్నాటక, గోవా.. ఇలా చెప్పుకుంటూ పోతే దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.

ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఇలా ఎమ్మెల్యేలనీ, ఎంపీలను కొనుగోలు చేయడంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఎక్కడ తమకి అధికారం కావాలనుకుంటే, అక్కడ ప్రజా ప్రతినిథుల్ని నిస్సిగ్గుగా కొనేస్తోంది. ‘అబ్బే, వాళ్ళని మేం కొనట్లేదు.. మా భావజాలం నచ్చి, మా పార్టీలో చేరుతున్నారు..’ అని బీజేపీ చెప్పుకుంటోందనుకోండి.. అది వేరే సంగతి.

టీడీపీ నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు బీజేపీలోకి ఎందుకు దూకేశారో అందరికీ తెలుసు. ఆ మాటకొస్తే, అంతకు ముందు చంద్రబాబు కూడా, వైసీపీని దెబ్బతీయడానికి ఎమ్మెల్యేలను కొనేశారు. అంతకన్నా ముందు, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనేయడం చూశాం.

తెలంగాణ రాష్ట్ర సమితి ఈ విషయంలో తక్కువేం తినలేదు. ‘సంతలో పశువుల్లా అమ్ముడుపోతున్నారు..’ అనే విమర్శ అన్ని రాజకీయ పార్టీలు చేయడం చూస్తున్నాం.. అలా విమర్శలు చేసినవాళ్ళే కొనేస్తున్నారు కూడా.