టీటీడీపై హీరో తండ్రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..పోలీసు కేసు న‌మోదు

వైకాపా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంపై అన్య‌మ‌తా ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని..టీటీడీ ఆస్తులు మ‌తం మారుతున్నాయి అనే ఆరోప‌ణ‌లు మిన్నంటుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో త‌మిళ హీరో సూర్య తండ్రి శివ‌వ‌కుమార్ టీటీడీ అధికారుల‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసారు. తిరుమ‌ల‌లో డ‌బ్బున్న వారికే ద‌ర్శ‌న అనుమ‌తులు ల‌భిస్తున్నాయ‌ని, గెస్ట్ హౌస్ లు వాళ్ల‌కే క‌ల్పిస్తున్నార‌ని మండిప‌డ్డారు. సామాన్యుల‌ను గ‌డ్డిపోచ‌లా తీసేస్తున్నార‌ని, అలాంటి ఆల‌యంలోకి ఎందుకు వెళ్లాల‌ని వాపోయారు. ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో దావానా వ్యాపించాయి.

దీంతో త‌మిళ మ‌య్యాన్ అనే వ్య‌క్తి శివ‌కుమార్ పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. శివ కుమార్ స‌హా మ‌రో ఏడుగురిపై అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ట్లు తెలుస్తోంది. తిరుమ‌ల‌లో అసాంఘిక కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయ‌ని, తిరుమ‌ల‌కు వెళ్లొద్దంటూ శివ కుమార్ అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విష‌యంపై టీటీడీ అధికారులు సీరియ‌స్ గానే రియాక్ట్ అయ్యారు. తిరుమ‌ల‌పై దుష్ర్ప చారం చేస్తే ఎంత‌టి వారినైనా వ‌దిలిపెట్టేది లేద‌ని హెచ్చ‌రించారు. టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి కూడా తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసారు. శివ‌కుమార్ పై చ‌ట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని హెచ్చ‌రించిన‌ట్లు స‌మాచారం.

ఇటీవ‌లే టీటీడీ ఆస్తుల అమ్మ‌కంపై దేశ వ్యాప్తంగా దుమారం రేగిన సంగ‌తి తెలిసిందే. దేవుడుకి కానుకలుగా ఇచ్చిన ఆస్తుల‌ను అమ్మే హ‌క్కు ప్ర‌భుత్వానికి ఎక్క‌డుంద‌ని దాత‌లు స‌హా భ‌క్తులు మండిప‌డ్డారు. టీటీడీ ని క్రైస్త‌వ మ‌తానికి మారు పేరుగా మార్చే స్తున్నార‌ని ఆరోప‌ణ‌లు ప‌తాక స్థాయికి చేరుకున్నాయి. దీంతో వైకాపా ప్ర‌భుత్వం ఆస్తుల అమ్మ‌కంపై వెన‌క్కి త‌గ్గింది. ఇక శివ‌కుమార్ ముక్కు సూటి మ‌నిషి. గ‌తంలో ఓ అభిమాని సెల్పీ కోసం మీద‌ ప‌డితే ఫోన్ తీసుకుని నేల‌కేసి కొట్టారు. ఆ కోపం చల్లారిన త‌ర్వాత క్ష‌మాప‌ణ‌లు చెప్పి కొత్త ఫోన్ కొనిచ్చారు.