కొడుకు ఆర్యన్ బెయిల్ కోసం షారుక్ ‘కోట్లు’ ఖర్చు చేశాడా.?

డ్రగ్స్ కేసులో అరెస్టయిన తన కుమారుడు ఆర్యన్ ఖాన్‌ని బెయిల్ మీద బయటకు తీసుకురావడం కోసం తండ్రి షారుక్ ఖాన్ పడ్డ కష్టం ఎట్టకేలకు ఫలించింది. ఆర్యన్ ఖాన్ బెయిల్ పొందాడు. కానీ, ఈ బెయిల్ కోసం షారుక్ ఖాన్ కనీ వినీ ఎరుగని స్థాయిలో కష్టపడాల్సి వచ్చింది.

నిజానికి, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్.. పైకి చాలా సౌమ్యంగా కనిపించాడు. అస్సలెక్కడా ఓవరాక్షన్ చేయలేదు. కానీ, తెరవెనక చెయ్యాల్సినదంతా చేశాడు. పెద్ద లీగల్ టీమ్ ఏర్పాటు చేసి, రాత్రీ పగలూ అన్న తేడాల్లేకుండా కేసుని స్టడీ చేశాడు.

సీనియర్ న్యాయవాది ముకుల్ రహోత్‌గీని రంగంలోకి దించి, తనయుడికి బెయిల్ తెప్పించుకున్నాడు షారుక్ ఖాన్. లక్షల్లో ఫీజు (గంటలు, రోజుల లెక్కన) తీసుకున్న న్యాయవాది ముకుల్, ఈ కేసులో బెయిల్ తెప్పించి.. అందర్నీ ఆశ్చర్యపరిచారు.

‘ముకుల్ రహోత్‌గీ రంగంలోకి దిగాక బెయిల్ రాకపోతే వింత..’ అని అంటున్నారు న్యాయ నిపుణులు. ఆయనకున్న క్రేజ్ అలాంటిది మరి. ఎన్ని కోట్లు ఖర్చయ్యాయో మరి.? అనే చర్చ కూడా జరుగుతోంది బాలీవుడ్ సినీ వర్గాల్లో. సినిమాల్లో వందల కోట్లు సంపాదించే షారుక్ ఖాన్, తన కుమారుడి కోసం కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే వెనుకాడతాడా.?

ఓ ప్రకటన నుంచి వచ్చే సొమ్ము ఖర్చు చేసినా.. అది చాలా చాలా ఎక్కువ. అయితే, డ్రగ్స్ కేసులో బెయిల్.. అన్న మాటే చాలామందికి మింగుడుపడ్డంలేదు. బాలీవుడ్ సినీ జనం చాలామంది, షారుక్ తనయుడికి బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేస్తోంటే, ఇంకొందరు మాత్రం, ‘డబ్బు లేనోళ్ళ పరిస్థితి ఏంటి.?’ అని ప్రశ్నిస్తున్నారు.

చట్టం, న్యాయం అందరికీ సమానమే కదా.? కోట్లు ఖర్చు చేస్తే బెయిల్ వచ్చేస్తుందా.? అన్నది వారి ప్రశ్న. కానీ, బెయిల్ పొందడమంటే, కేసు నుంచి క్లీన్ చిట్ వచ్చినట్లు కాదన్నవిషయాన్ని న్యాయ నిపుణులు గుర్తు చేస్తున్నారు.