తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలనుకుంటున్న షర్మిల, త్వరలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఏప్రిల్ 9వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన నేతలతో షర్మిల చర్చలు జరిపారు. పార్టీ నిర్మాణం సహా కీలక అంశాలపై ఈ చర్చల్లో అందరి నుంచీ తగిన సమాచారం రాబట్టారు షర్మిల. ఏయే జిల్లాల్లో, ఏయే నియోజకవర్గాల్లో (అసెంబ్లీ, పార్లమెంటు సిగ్మెంట్లు) వైఎస్ అభిమానులు ఎక్కువగా వున్నారు.? రాష్ట్ర రాజకీయాలపై ఆ ఓటు బ్యాంకు చూపించే ప్రభావమెంత.? వంటి అంశాల గురించి ఆరా తీశారు షర్మిల. ఈ చర్చల్లో ఖమ్మం నుంచి అత్యద్భుతమైన ఫీడ్ బ్యాక్ షర్మిలకు అందిందట.
ఆ కారణంగానే ఆమె ఖమ్మం మీద మరింత ఫోకస్ పెట్టారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. పైగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే, ఆంధ్రపదేశ్ రాష్ట్రంతో చాలా పెద్ద సరిహద్దు వున్న ప్రాంతం. పశ్చిమగోదావరి జిల్లా సహా పలు ఏపీ జిల్లాలు ఖమ్మంతో సరిహద్దుని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయా ఏపీ జిల్లాల నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చి, ఖమ్మంలో సెటిలైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఎక్కువ. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్న షర్మిల, ఆ జిల్లా తమ పార్టీకి సేఫ్ జోన్.. అనే అభిప్రాయానికి వచ్చారట. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తానని షర్మిల ప్రకటించేసిన విషయం విదితమే. అయితే, ఎన్నికలకు ఇంకా చాలా సమయం వుంది. అప్పటికి ఈక్వేషన్స్ ఎలా మారతాయో ఇప్పుడే చెప్పలేం. ఇదిలా వుంటే, ఖమ్మం జిల్లాకి చెందిన కొందరు గులాబీ నేతలు (కింది స్థాయి నేతలు) షర్మిల పార్టీకి సంబంధించిన నేతలతో టచ్‌లో వున్నారట. ఏప్రిల్ 9న తెలంగాణలోని వివిద జిల్లాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నేతలు షర్మిల పార్టీలో చేరబోతున్నారట కూడా.