పాలమ్మిన, పూలమ్మిన’ అంటూ తన కష్టాలను సూటిగా, స్పష్టంగా చెప్పి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాఖీ పండుగ సందర్భంగా తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన మల్లారెడ్డి, తనకు 73 సంవత్సరాలు వచ్చాయని చెప్పారు. తాను ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశానని, ఇకపై రాజకీయాలు చాలని భావిస్తున్నానని అన్నారు. మరో మూడు సంవత్సరాలు మాత్రమే రాజకీయాల్లో కొనసాగుతానని.. ఆ తర్వాత ప్రజాసేవ చేస్తూ, తన విద్యాసంస్థలైన కాలేజీలు, యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రస్తుతం తాను ఏ పార్టీ వైపు మొగ్గు చూపడం లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.
మల్లారెడ్డి రాజకీయ ప్రయాణం చాలా ఆసక్తికరంగా సాగింది. తొలుత ఆయన వ్యాపారవేత్తగా, విద్యాసంస్థల అధినేతగా ఎదిగారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి.. 2014లో టీడీపీ తరపున మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరి.. 2018లో మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని కూడా పొందారు. ఆయన ఏ విషయం చెప్పినా.. అది విలేకరుల సమావేశం అయినా, బహిరంగ సభ అయినా తనదైన శైలిలో సూటిగా, స్పష్టంగా మాట్లాడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించేవారు.
మల్లారెడ్డి చేసిన ఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చాయని చెప్పవచ్చు. బలమైన ప్రజా బలం ఉన్న నాయకుడు పార్టీని వీడితే అది పార్టీకి నష్టం కలిగించవచ్చు. మరోవైపు.. ఈ వ్యాఖ్యల వల్ల కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునేవారికి అవకాశాలు లభించవచ్చని భావిస్తున్నారు. మల్లారెడ్డి నిజంగానే రాజకీయాల నుంచి వైదొలగితే.. ఆయన ప్రాతినిధ్యం వహించే మేడ్చల్ నియోజకవర్గంలో కొత్త నాయకుడు ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
మల్లారెడ్డి నిర్ణయం వెనుక వ్యక్తిగత కారణాలతో పాటు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు కూడా ఒక కారణమై ఉండవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఆయన చేసిన ఈ తాజా ప్రకటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఆయన నిజంగానే రాజకీయాల నుంచి తప్పుకుంటారా, లేక భవిష్యత్తులో మనసు మార్చుకుంటారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
