సెప్టెంబర్ 17వ తేదీ తెలంగాణ చరిత్రలో వెరీ వెరీ స్పెషల్ డే. విమోచన దినోత్సవమంటారు.. విముక్తి పొందిన రోజుగా అభివర్ణిస్తారు. విలీన దినోత్సవమన్న వాదన కూడా వుంది. అసలేంటి సెప్టెంబర్ 17వ తేదీ. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో గులాబీ జెండాలు, సెప్టెంబర్ 17వ తేదీ కంటే ముందే నానా హంగామా చేసేవి. తాము అధికారంలోకి వచ్చాక, అధికారికంగా సెప్టెంబర్ 17వ తేదీని విలీన, విమోచన, విముక్తి దినోత్సవంగా పాటిస్తామంటూ హంగామా చేసేశారు గులాబీ నేతలు. కానీ, ఇప్పుడేమయ్యింది.? ఏడేళ్ళుగా సెప్టెంబర్ 17వ తేదీకి ఎలాంటి ప్రత్యేకతా కనిపించడంలేదు. బీజేపీ సహా వివిధ రాజకీయ పార్టీలు ఈ విషయమై పెద్దయెత్తున ఆందోళనలు చేస్తున్నాయి అధికార తెలంగాణ రాష్ట్ర సమితి తీరుని నిరసిస్తూ. అయినాగానీ, తెలంగాణ రాష్ట్ర సమితి దిగి రావడంలేదు.
కారణం, మజ్లిస్ పార్టీతో స్నేహమే. భారతదేశంలో ప్రస్తుత తెలంగాణ భూభాగం అధికారికంగా విలీనమైన రోజు అది. అప్పటి హైద్రాబాద్ సంస్థానంపై బారత ప్రభుత్వం సైనిక చర్య చేపట్టాల్సి వచ్చిన నాటి పరిస్థితుల్ని చాలామంది నేటికీ గుర్తు చేసుకుంటుంటారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక, సెప్టెంబర్ 17వ తేదీకి ఎలాంటి ప్రాముఖ్యతా అవసరం లేదని గులాబీ పార్టీ భావిస్తుండొచ్చుగాక.. కానీ, భారతదేశ చరిత్రలో.. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17వ తేదీ వెరీ వెరీ స్పెషల్ అని చాలామంది భావిస్తుంటారు. తెలంగాణ చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఎన్నెన్నో ప్రాణ త్యాగాలు కన్పిస్తాయి. వాటిని స్మరించుకోవడానికి సెప్టెంబర్ 17 కంటే ముఖ్యమైన రోజు ఇంకేముంటుంది.? సెప్టెంబర్ 17 అంటే అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ రాజకీయ అవసరాల కోసమే నిర్దేశించబడ్డ ఓ రోజుగా మారిపోవడం శోచనీయం. వందలాది, వేలాది ప్రాణాల త్యాగాలకు విలువ లేకుండా చేసేస్తున్నారు నేటి రాజకీయ నాయకులు.. అన్న ఆవేదన తెలంగాణ సమాజంలో వుంది.