ఇటీవలే టీడీపీ పై విమర్శల్లో భాగంగా ఓ మంత్రి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు వైకాపాలోకి జంప్ అవుతున్నట్లు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. విశాఖ ఎల్ జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటపై విపక్షనేత చంద్రబాబు నాయుడు చేస్తోన్న కుళ్లు రాజకీయాల నేపథ్యంలో ఓ మంత్రి మీ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను బయటకు రాకుండా కాపాడుకోండి? అంటూ విమర్శించారు. తాజాగా ఆయన విమర్శలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఇందులో ఓ టిక్కెట్ కన్ఫమైనట్లేనని సంకేతాలు అందుతున్నాయి. విశాఖ దక్షిణ నియోజక టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైకాపాలోకి జంప్ అవుతున్నట్లు స్థానిక వాసుల్లో చర్చకొచ్చింది.
విశాఖని ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత విశాఖ టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిలో మార్పులను స్పష్టంగా చూస్తూనే ఉన్నాం. విశాఖ కంచుకోటగా ఏ నియోజక వర్గం నుంచైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న విశాఖ టీడీపీ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజధాని విషయంలో తొలి నుంచి మౌనంగా ఉన్న సంగతి తెలిసిందే. విశాఖను రాజధానిగా చేస్తే ఎక్కువగా లబ్ది పొందేది గంటానే. దీంతో గంటా వైకాపాలోకి జంప్ అవ్వాలని కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నా..ఆయనలో పార్టీ స్థిరత్వం ఉండదన్న కారణంగా వైకాపా శ్రేణులు అడ్డుపడుతున్నారు. అయినా గంటా పరోక్షంగా వైకాపాని సపోర్ట్ చేస్తున్నట్లు మొన్న విశాఖ ఘటనతో మరోసారి స్పష్టమైంది.
అధికార పక్షంపై ఎలాంటి కామెంట్లు చేయకుండా సైలెంట్ గా ఉన్నారు. ఇక వాసుపల్లి గణేష్ గంటాకి ప్రధాన అనుచరుడిగాను మెలిగారు. గంటా మాటను కాదనలేరు. ఇద్దరి మధ్య మంచి ప్రెండ్ షిప్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో వాసుపల్లిని వైకాపాలోకి జంప్ అవ్వమని సలహా ఇచ్చింది కూడా గంటా అనే సమాచారం. దీనిలో భాగంగా ఇటీవలే వాసుపల్లి గణేష్ మంత్రి బోత్స సత్యనారాయణతో మంతనాలు జరిపినట్లు వినిపిస్తుంది. ఇందులో కీలక పాత్ర పోషించింది గంటా అనే టాక్. అదే నిజమైతే టీడీపీ 23 మంది ఎమ్మెల్యే ల నుంచి ఒకరు జంప్ అయితే ఆ సంఖ్య 22కి చేరుకుంటుందది. మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు? అన్నది తెలియాల్సి ఉంది. ఆ ఇద్దరు కూడా విశాఖ నుంచే అయితే ఇది గంటా సీక్రెట్ మిషన్ అనే అనుకోవాలి.