విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైకాపా కండువా కప్పుకోవడం దాదాపు ఖాయమైంది. ఈనెల 15న తన అనుచర గణంతో పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. గంటా ఏడాది కాలంగా చేస్తున్న ప్రయత్నాలు చివరికి 16 నెలలు తర్వాత ఫలించా యి. గంటాని ఎట్టి పరిస్థితిల్లో పార్టీలోకి రానివ్వకూడదని మంత్రి అవంతి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గట్టిగానే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గంటా అవసరం జగన్ కు కొంత వరకూ ఉంది. విశాఖలో గంటా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలిచే సత్తా ఉన్న నాయకుడు కావడం, ఆయన సామాజిక వర్గం జిల్లాలో బలంగా ఉండటం వంటి ఫ్యాక్టర్స్ కలిసొచ్చాయి.మరి ఏడాది కాలంగా జరగనది ఇప్పుడే ఎందుకు జరిగింది? ఆయన అనుచరుడు నలంద కిషోర్ అరెస్ట్ తర్వాత గంటా వైకాపా లో చేరే స్పీడ్ పెంచారా? అంటే అదీ ఓ కారణమై ఉండొచ్చు.
అయితే గంటా ఎంట్రీకి లైన్ క్లియర్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్ర పోషించారు అన్నది ఇప్పుడు పొలిటికల్ కారిడార్ లో హాట్ టాపిక్. గంటా-చిరంజీవి మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ కారణంగానే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించగానే గంటా మరో ఆలోచన లేకుండా పచ్చ జెండాని వదిలేసి ప్రజారాజ్యంలోకి వచ్చేసారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీ పరిస్థితులు పక్కనబెడితే! గంటా ఇప్పుడు వైకాపా లోకి రావడానికి చిరంజీవి ముఖ్య భూమిక పోషించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. చిరంజీవి జగన్ మద్దతుదారుడుగా ఉన్న సంగతి తెలిసిందే. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్దిలో భాగంగా మెగాస్టార్ జగన్ వెంటే ఉన్నారు.
విశాఖలో పరిశ్రమ అభివృద్దే లక్ష్యంగా చిరంజీవి శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు మధ్య మంచి స్నేహం కూడా కుదిరింది. ఎప్పటికప్పుడు జగన్ ని కలవడం విశాఖ డెవలప్ మెంట్ గురించి మాట్లాడటం, ఫోన్ డిస్కషన్స్ వంటివి ఇరువురి మధ్య జరుగుతున్నాయి. ఈ క్రమంలో గంటాలాంటి బడా నేత కూడా తోడైతే తిరుగుండదు అన్న చర్చ ఇరువురి మధ్య వచ్చినట్లు తెలుస్తోంది. విశాఖ చుట్టూ గంటాకు భారీగా ల్యాండ్లు ఉన్నాయి. ముఖ్యంగా రాజధాని అభివృద్ది ప్రాంతంలోనే గంటా స్థలాలన్ని కొలువై ఉన్నాయి. అవన్నీ ఎలాంటి ఆటకం లేకుండా అభివృద్దిలోకి రావాలంటే గంటా పార్టీలో ఉంటే మంచిదని జగన్-గంటా మధ్య చిరంజీవి వారధిగా నిలిచి ఉంటారనే పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇన్నాళ్లు అడ్డుపడ్డ నేతల్ని జగన్ ఇప్పుడు పక్కనబెట్టి గంటాకి లైన్ క్లియర్ చేసినట్లు కొంతమంది గట్టిగానే వాదిస్తున్నారు.