పరిషత్ ఎన్నికల రద్దుపై హైకోర్టునాశ్రయించిన ఎస్ఈసీ

 

SEC Challenges In HC, Regarding cancellation of Parishad Polls

ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల వ్యవహారానికి సంబంధించి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఎస్ఈసీ విడుదల చేసిన విషయం విదితమే. అదే రోజు నీలం సాహ్నీ ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే హడావిడిగా ఆ నోటీసుని, సుప్రీంకోర్టు తీర్పుని సరిగ్గా అర్థం చేసుకోకుండా విడుదల చేశారన్నది ఆ తర్వాత హైకోర్టు తేల్చిన అంశం.

ఈలోగా పరిషత్ ఎన్నికలు జరిగాయి.. వైసీపీ విజయఢంకా మోగించింది కూడా. అయితే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా వున్నప్పుడు తలెత్తిన వివాదం, సుప్రీంకోర్టు తీర్పు.. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, పరిషత్ ఎన్నికల్ని రద్దు చేయాలని కొందరు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ అంశంపై విచారణ జరిగింది.. హైకోర్టు తీర్పు వెలువరించింది.. పరిషత్ ఎన్నికల్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నీ హైకోర్టు ‘డివిజన్ బెంచ్’ని ఆశ్రయించారు. కాగా, కరోనా నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ఈ క్రమంలో నానా యాగీ జరిగింది. నిమ్మగడ్డపై కులం పేరుతో అధికార వైసీపీ నేతలు తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు.

స్థానిక ఎన్నికలకు సంబంధించి సవరణలు తీసుకొచ్చి, నిమ్మగడ్డను వైఎస్ జగన్ ప్రభుత్వం తొలగించింది కూడా. ఆయన స్థానంలో కనగరాజ్ నియామకం జరిగింది. అయితే, నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించడంతో కనగరాజ్ నియామకం రద్దయ్యింది.. నిమ్మగడ్డ తిరిగి ఎస్ఈసీ అయ్యారు.

మరోపక్క, సర్వోన్నత న్యాయస్థానం.. కరోనా నేపథ్యంలో పరిషత్ ఎన్నికల ప్రక్రియ వాయిదాని సమర్థిస్తూ.. తిరిగి ప్రక్రియ ప్రారంభించాలనుకుంటే.. 4 వారాల ముందు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆదేశించింది. ఆ ఆదేశాల్ని కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నీ పరిగణలోకి తీసుకోకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వడంతోనే ఇంత వివాదం నడిచింది.